ఐఏఎస్ అధికారి అన్న గౌరవం లేదు. గౌరవప్రథమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నాడన్న మర్యాద లేదు.. ఏదో విషయంలో తనకు నచ్చలేదని ఏకంగా.. ఆయనను సన్నాసి అంటూ రెచ్చిపోయాడు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ ల సంఘం తీవ్రంగా ఖండించింది. అలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదని అధికారుల గౌరవానికి భంగం కలిగించే మాటలు వాడడం తప్పని ఓ ప్రకటనలో తెలిపింది.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అవమానకర, ఆధారరహిత ఆరోపణలు చేశారని తెలంగాణ ఐఏఎస్ ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు.. ఆ అధికారి నిష్పక్షపాత వైఖరి, విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉన్నాయని.. అలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. కేటీఆర్ వ్యాఖ్యలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలను ప్రశ్నిస్తున్నాయని.. అలాంటి మాటల్ని తమ సంఘం ఖండిస్తోందని తెలిపింది.
ప్రజాసేవలో బాధ్యతాయుతమైన అధికారిగా.. తన విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుందన్న ఐఏఎస్ ల సంఘం.. కేటీఆర్ చేసిన నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విమర్శల్ని తప్పుబట్టిన ఐఏఎస్ అధికారుల సంఘం.. కలెక్టర్ కు తమ పూర్తి మద్ధతు ఉంటుందని ప్రకటించింది. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతాని కాపాడటానికి తాము అండగా నిలబడతామని స్పష్టం చేస్తోంది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు, విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని.. కాబట్టి.. అనవసర విషయాల్లోకి బాధ్యతాయుత విధులు నిర్వహిస్తున్న అధికారుల్ని లాగొద్దని సూచించింది.
ఇకపై అధికారులపై ఇలాంటి ఆరోపణలు, మాటలు నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది.
ఇటీవల తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో కేటీఆర్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అందులో.. పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగానే.. జిల్లా కలెక్టర్ గా కాంగ్రెస్ కార్యకర్తను తీసుకువచ్చిన కూర్చోబెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కలెక్టర్ ని పట్టుకుని.. ఇలాంటి సన్నాసులకు భయపడే పనే లేదంటూ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అతి చేస్తున్న పోలీసులు, అధికారులు అందరికి తాము తిరిగి అధికారం చేపట్టిన తర్వాత బదులిస్తామని, అప్పటి వరకు ఎవరు ఏం చేసినా చూస్తూ ఉంటామంటూ హెచ్చరికలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్ నెట్ లో వైరల్ కాగా… కేటీఆర్ వాడిన భాషపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గౌరవప్రదమైన ఐఏఎస్ హోదాలోని వ్యక్తిని అలా అనడం సరైంది కాదంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే సంబంధిత కలెక్టర్ కు రాష్ట్ర ఐఏఎస్ సంఘం అండగా నిలిచింది.