ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని సూచించారు. పదే పదే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనకు నివేధిక పంపాలని ఆదేశించారు.
విద్యార్థులకు పెట్టే భోజనంలో నిర్లక్ష్యం వహించినట్టు తేలితే ఉద్యోగాలను కూడా తొలగిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా అధికారులు, సిబ్బంది తీరుమారడం లేదు. ఇప్పటికే సీఎం ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ అయ్యారు. మెస్ చార్జీలు పెంచామని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్చరించారు. లేదంటూ చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం వార్నింగ్ ఇచ్చి నెల రోజులు కూడా అవ్వడంలేదు. ఇంతలోనే కొమురంభీం జిల్లాలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థిని మృతి చెందడం సంచలనంగా మారింది.
వాంకిడిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శిరీష అనే విద్యార్థిని అక్టోబర్ 30వ తేదీన ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చేరింది. శిరీషతో పాటూ మొత్తం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా శిరీష పరిస్థితి విషమించింది. రాత్రి భోజనం తరవాత విద్యార్థినులు ఆస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శిరీష పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. నెలరోజులుగా చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమించి సోమవారం కన్నుమూసింది.
ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతితో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నాయి. శిరీష ఆస్పత్రిలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
హైకోర్డు ఆగ్రహం:
ఇదిలా ఉండగానే నిన్న నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ తీవ్రమైన చర్యగా కోర్టు భావించింది. అధికారులు నిద్రపోతున్నారా? అని మండిపడింది. వారంలో మూడుసార్లు భోజనం కలుషితం అయితే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అని నిలదీసింది.
అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవడంలేదని మండిపడింది. దీంతో వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఆయన స్పందనపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని, ఆదేశాలు జారీ చేస్తే కానీ పనిచేయరా? అని ప్రశ్నించింది. ఇప్పుడు సీఎం సైతం అధికారులను హెచ్చరించారు. మరి ఇప్పుడైనా అధికారుల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.