వారిపై పరువు నష్టం కేసులు వేయబోతున్న జగన్..

అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక కార్యనిర్వహక వ్యక్తి భాగస్వామిగా ఉన్నాడంటూ ఆమెరికా విచారణ సంస్థ సంచలన విషయాల్ని బయటపెట్టింది. ఈ విషయం రాజకీయంగా దూమారం రేపుతుండడంతో.. వైసీపీ ఆధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మీడియా సమావేశం నిర్వహించారు. తన హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేశారు. అత్యంత చవకగా కుదుర్చుకున్న ఒప్పందాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనేక విషయాలపై స్పందించారు.

 

ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదని వ్యాఖ్యానించిన జగన్.. తనకు లంచం ఇచ్చినట్లు ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. విద్యుత్ కొనుగోలు విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా సార్లు అదానీని కలిసినట్లు చెప్పిన జగన్.. ఏపీలో అదానీకి చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు. సీఎంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరుగుతూనే ఉంటాయన్న జగన్.. తన భేటీలకు విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు తనకు లంచం ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి లీగల్ నోటీసులు ఇస్తామన్న జగన్.. అమెరికాలో నమోదైన కేసు గురించి తనకు తెలియదని అన్నారు. కేసులో బైడెన్ పూరు ఉంటే ఆయనను అడుగుతారా అంటూ ఎదురు ప్రశ్నించారు.

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. గత వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు కుట్రలు చేస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వివిధ పత్రికల్లో, మీడియాలో వస్తున్నట్లు అదానీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదని.. ఒప్పందాలు జరిగింది.. కేంద్ర ప్రభుత్వం – సెకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన, అవినీతిమయమైన కొనుగోలుగా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న తరుణంలో… అది అత్యంత చవకైనా విద్యుత్ కొనుగోలు ఒప్పందమని జగన్ తెలిపారు. రాష్ట్రానికి లాభం చేకూర్చే ఇలాంటి ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

 

విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేశారని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి.. డిస్కంలకు వేల కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను కాపాడే ప్రయత్నం చేసామంటూ తెలిపారు. అలాగే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ కోసం రూ. 5.90 తో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న జగన్.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూనిట్‌కు రూ. 2.40 నుంచి రూ. 2.50 కు విద్యుత్ సరఫరా చేసేందుకు 24 బిడ్లు వచ్చాయని తెలిపారు. కానీ చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారంటూ ఆరోపించారు. అలాంటి సమయంలో 2021 సెప్టెంబర్‌ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – సెకి (Solar Energy Corporation of India Limited) యూనిట్‌కు రూ.2.49కే విద్యుత్ సరఫరాకు ముందుకు వచ్చిందని తెలిపారు. అలా.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల విద్యుత్ ను, 2024 నాటికి మరో 3 వేల మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సంసిద్ధమైందని తెలిపారు. ఇది ఏపీ చరిత్రలోనే అతి తక్కువ ధరకు కుదుర్చుకున్న విద్యుత్ పంపిణీ ఒప్పందమని జగన్ చెప్పుకొచ్చారు.

 

ఏపీ అవసరాలకు కేంద్ర సోలార్ సంస్థ విద్యుత్ అందించేందుకు ఒప్పందం కుదిరిందని.. ఇక్కడ మూడో పక్షం ఎక్కడుందని ప్రశ్నించారు. ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు) ఛార్జీలు యూనిట్‌కు రూ.1.98 పైసా చొప్పున లేకుండా ప్రత్యేక రాయితీలు సైతం అందిస్తామన్నారని వెల్లడించారు. ఈ ఒప్పందం కారణంగా.. ఏడాదికి రూ. 4 వేల 400 కోట్లు ఆదా అవుతున్నాయని.. అలా పాతికేళ్లకు చేసుకున్న ఒప్పందం కారణంగా రూ. లక్షల కోట్లు రాష్ట్రానికి మిగిలేవంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా సంపద సృష్టి కాదా అంటూ ప్రశ్నించారు.

 

చంద్రబాబు హయాంలోనే విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయన్న జగన్.. విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడిందని ఆరోపించారు. ఈ విషయాలు అన్నీ వదిలిపెట్టి.. కావాలని తనపై, తన హయాంలోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తోందని వ్యాఖ్యానించి జగన్మోహన్ రెడ్డి.. లోకేష్ రెడ్‌బుక్‌ పరిపాలన నడుపుతున్నారంటూ ఆగ్రహించారు. ఇది రాజ్యాంగానికి తూట్లు పొగవడమే అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్‌, ఇసుక దందాలు, పేకాట క్లబ్‌లే కనిపిస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా సూపర్ సిక్స్ హామీలు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *