పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాజ్యసభ ముందు భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. అంతే కాకుండా అదానీ కేసు, మణిపూర్ అల్లర్ల అంశాలపై సమావేశంలో చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. నిన్న అదానీ లంచం ఆరోపణలపై చర్చ జరపాల్సిందేనని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.
రాజ్య సభ, లోక్ సభలో చర్చ జరగాలని అన్నారు. కానీ లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ చర్చకు అనుమతించలేదు. దీంతో విపక్ష ఎంపీలు సైతం తగ్గేదే లే అన్నారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. సభను నేటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవాళ కూడా అదానీ లంచం ఆరోపణలపై చర్చ జరగాల్సిందేనని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం అయ్యారు. పార్లమెంట్ భవన్‌లో కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు.
అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉంటే అదానీ లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రధాని మోడీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రాజెక్టులన్నీ అదానీకి కట్టబెట్టి ఆయనను కుభేరుడిని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అర్హత లేకున్నా అదానీ కంపెనీలకు రుణాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమెరికాలో లంచం కేసులో అదానీ అరెస్ట్ అయితే మోడీ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.