రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన చరిత్రాత్మక సందర్భానికి నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా రాజ్యాంగ వజ్రోత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంప్, నాణెం ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించి.. వారి కృషిని గుర్తుచేసుకోనున్నారు.
సభను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలందరికి రాజ్యాంగ దినోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం అని ద్రౌపది ముర్ము అన్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగం రూపకల్పన జరిగిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా సమాజంలో బలహీన వర్గాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు రాష్ట్రపతి ముర్ము. మన రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రం అని తెలిపారు. రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధ్యమైందన్నారు. రాజ్యాంగాన్ని రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ మార్గనిర్దేశం చేశారన్నారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలని రాష్ట్రపతి ముర్ము గుర్తుచేశారు.