రేపే ప్రమాణ స్వీకారం.. తేలని సిఎం పదవి పంచాయితీ.. అజిత్ పవార్ కీలకం..!

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత రసవత్తర రాజకీయాలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. కూటముల మధ్య పోటీ ఒకవైపు ఉంటే.. కూటమిలో పార్టీల మధ్య మరోరకమైన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి రెండు రోజులు గడిచాయి. అయితే ఎన్నికల తరువాత కూటమిలోని అన్ని పార్టీల నాయకులు చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అది అందరికీ అంగీకరించాలని అమిత్ షా, బిజేపీ పెద్దలు ఇంతకుముందు తెలిపారు. నవంబర్ 26న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారనేది మహాయుతి కూటమి స్పష్టంగా చెప్పడం లేదు.

 

ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకులేమో దేవేంద్ర ఫడ్నవీస్‌కు మాత్రమే సిఎం పదవికి అర్హత ఉందని చెబుతన్నారు. మహాయుతి కూటమి ఇంతటి భారీ విజయం సాధించడానికి బిజేపీ నాయకులు తాము ఎంతో శ్రమపడ్డామని కారణాలు చూపుతున్నారు. మరోవైపు షిండే శివసేన నాయకుడు మాత్రం ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండేని కొనసాగించాల్సిందే అని గట్టిగా వాదిస్తున్నారు. మహాయుతి కూటమి అధికారంలో రావడానికి షిండే ముందుచూపుతో అమలు చేసిన లడ్కీ బహిన్ సంక్షేమ పథకం ప్రధాన కారణమని వాదిస్తున్నారు. అయితే ఇరువురికి సొంతంగా మెజారిటీ లేదు కాబట్టి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారింది. అజిత్ పవార్ ఎవరికి మద్దతు తెలిపితే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవి చేపట్టేలా పరిస్థితులు మారిపోయాయి.

 

ప్రస్తుత పరిస్థితుల్లో బిజేపీ వద్ద భారీ సంఖ్యలో సీట్లు ఉండడం, కేంద్రంలో బిజేపీ అధికారంలో ఉండడం కారణంగా ఆయన ఫడ్నవీస్‌కు తన మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో 232 సీట్లు మహాయుతి కూటమి గెలుచుకుంది. ఇందులో అత్యధికంగా 132 సీట్లు బిజేపీ ఖాతాలో ఉన్నాయి. షిండే శివసేన వద్ద 57, అజిత్ పవార్ ఎన్సీపీ వద్ద 41 సీట్లు ఉన్నాయి. నవంబర్ 24 సాయంత్రం మహాయుతి కూటమి పార్టీల కీలక నాయకులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శివసేన ఎమ్మెల్యేలు ఏక్ షిండ్ నే ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు. దీంతో సిఎం పదవి పంచాయితీ ఏటూ తేల లేదు.

 

అందుకే ఫడ్నవీస్, షిండే, పవార్ ముగ్గురూ రాజధాని ఢిల్లీకి బయలుదేరి అక్కడ హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో సిఎం పదవి రొటేషనల్ బేసిస్ పై రెండు సంవత్సరాలు ఒకరు, మూడు సంవత్సరాలు మరొకరు అనేలా పంచుకుంటారని తెలుస్తోంది.

 

వినమ్రుడు ఫడ్నవీస్

బిజేపీ అదిష్ఠానం దృష్టిలో దేవేంద్ర ఫడ్నవీస్ ఒక వినమ్రుడు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ ఢిల్లీ పెద్దలు చెప్పడంతో తనకు ఇష్టం లేకపోయినా షిండే లాంటి చిన్న స్థాయి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా చేయడానికి అంగీకరించాడు. అంతే కాదు అతని కింద ఉపముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ పోటీ చేసిన 148 సీట్లలో 132 సీట్లు విజయం సాధించడానికి ఫడ్నవీస్ ఎంతో శ్రమ పడ్డారని స్వయంగా బిజేపీ పెద్దలే అంగీకరిస్తున్నారు. అందుకే ఆయనే ఈసారి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

ఏక్ నాథ్ షిండే ససేమిరా..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి ఏక్‌నాథ్ షిండే అంగీకరించడం లేదు. ఆయన ప్రవేశ పెట్టిన లడ్కీ బహిన్ యోజన కారణంగానే మహాయుతి కూటమికి భారీ విజయం లభించిందని బలంగా వాదిస్తున్నారు. శివసేన నాయకుడు దీపక్ కేసర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. “షిండే గారిని మాత్రమే ముఖ్యమంత్రి పదవి వరించాలి. ఆయన ముందు చూపు వల్లే ఎన్నికల్లో విజయం సాధించాం. అయితే చివరి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఫడ్నవీస్, షిండే, పవార్ ముగ్గురూ తీసుకుంటారు” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *