మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. పార్టీ చీఫ్ పదవికి నానాపటోల్ రాజీనామా..!

మహారాష్ట్ర ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో మహాయుతి కూటమి పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు ఘోర ఓటమి పాలైన మహావికాస్ అఘాడీ కూటమి నాయకులు చెల్లాచెదురై పోయారు. మహారాష్ట్ర రాజకీయాలలో కురువృద్ధుడు అపర చాణక్యుడిగా పేరుగాంచిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 10 సీట్లు రావడంతో ఆయన వయసు మీరిపోయిందని కారణాలు చూపి ఇక రిటైర్ అవుదామనే యోచనలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా పోటీ చేసిన మొత్తం 103 సీట్లలో కేవలం 16 సీట్లు రావడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఓటమికి తనదే బాధ్యత అంటూ రాజీనామా చేశారు.

 

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీని కలిసేందుకు నానా పటోల్ తన రాజీనామా సమర్పించేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అయితే ఖర్గే, రాహుల్ బిజీగా ఉండడంతో అది కుదరలేదు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ లేదా నానా పటోల్ అధికారికంగా ఇంతవరకు ప్రకటన చేయలేదు.

 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. పార్టీకి ఎన్నికల్లో పెద్ద విజయం అందబోతోందని నానాపటోల్ చాలాసార్లు కాంగ్రెస్ అధిష్టానికి ధీమా వ్యక్తం చేశారు. అందుకే కూటమిలో మిగతా పార్టీల కంటే అధికంగా 103 సీట్లపై కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఫలితాలు చూస్తే.. కేవలం 16 సీట్లే చేతికి చిక్కాయి. ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఆయన సకోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినా.. కేవలం 208 ఓట్ల తేడాతో ఒడ్డున చేరారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 8000 మెజారిటీతో గెలిచిన నానా పటోల్ ఈసారి తన ప్రభావం కోల్పోయారని తెలుస్తోం ది.

 

మరోవైపు కాంగ్రెస్‌కు బద్ధ శత్రువు అయిన బిజేపీ మాత్రం ఏకంగా 132 సీట్లు గెలుచుకుంది. బిజేపీ, మహాయుతి కూటమి ఇతర పార్టీలకు భారీ సంఖ్యలో సీట్లు లభించడంపై ఓటమి చెందిన శివసేన, కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఈవిఎం మెషీన్లలో మోసం జరిగిందనే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అయితే ఈ ఎన్నికలు అంతా మోసపూరితంగా జరిగాయని.. కొన్ని నెలల క్రితం లోక్ సభ ఎన్నికల్లో ఇదే ప్రజలు తమకు పట్టం కట్టారని చెప్పారు. కేవలం నాలుగు నెలల్లో ప్రజలు ఇంతలా తమను ఎలా మరిచిపోతారని ప్రశ్నించారు.

 

దేశంలో ఇలాంటి ఎన్నికల ఫలితాలు చూస్తుంటే.. దేశంలో ఇక ఒక పార్టీ మాత్రమే ఉంటుందని.. మిగతా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఈవిఎంలలో ట్యాంపరింగ్ జరిగిందనే విషయాన్ని ప్రజల విజ్నతకే వదిలేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా కూడా ఇదే తరహా అనుమానులు వ్యక్తం చేశారు. “దేశంలో ప్రతి సంవత్సరం విద్యార్థుల పరీక్షా పేపర్లు లీక్ అవుతున్నాయి. మరి అలాంటిది ఈవిఎం మెషీన్లు, ఇతరత్రా మోసాలు జరగడం లేదని ఎలా నమ్మాలి?” అని మీడియా ముందు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *