అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ పంచ్.. ఆ రూ.100 కోట్లు వద్దే వద్దంటూ ప్రకటన..

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ప్రకటించిన రూ. 100 కోట్ల విరాళాన్ని వెనక్కి పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొన్ని రోజులుగా అదానీ అంశంపై రాజకీయ దుమారం రేగుతుందని, అదానీ గ్రూప్ వివాదానికి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలంగాణలో నైపుణ్యతను పెంచేందుకు ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ అందజేసిన 100 కోట్ల విరాళాన్ని, తాము స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

 

అనవసర వివాదాలలో తెలంగాణను లాగ వద్దని, మీడియా కూడా ఈ విషయాన్ని గమనించాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులకు సంబంధించి ఏ సంస్థల కైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుందని, అదానీ నుండి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం చేయడం తగదన్నారు.

 

అలాగే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పైరవీలు చేయడం మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకే సాధ్యమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను తాము తెచ్చుకునేందుకు ఢిల్లీ పర్యటన చేస్తే, ప్రతి దానిని రాజకీయం చేయడం తగదన్నారు. అలాగే తనపై నమోదైన కేసుల నుండి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, పదేళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన విషయాన్ని బీఆర్ఎస్ ముందుగా గుర్తించాలన్నారు.

 

మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు తిరస్కరించినట్లే భావించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులను రాబట్టేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని, నేను ఢిల్లీకి వెళ్తుంటే మీరు పడే బాధలు చూసైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోష పడతారన్నారు.

 

రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా ఒక ఒప్పందాన్ని సమస్త ద్వారా కుదుర్చుకుంటే, దానిని రద్దు చేసేందుకు న్యాయపైన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని, పెట్టుబడులు వస్తే రావడం లేదంటూ చెప్పేది కూడా బీఆర్ఎస్ నేతలేనన్నారు.

 

అదానీతో టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సివస్తే, మాజీ సీఎం కేసీఆర్ పై కేసులు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పవర్ ప్లాంట్స్ నిర్మాణ పనులు అదానీకే ఇచ్చారని, జైలుకు పోయి వస్తే సింపతి వస్తుందనుకుంటే ఆల్రెడీ, కవిత జైలుకు వెళ్లి వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తించాలన్నారు.

 

ప్రస్తుతం ఆ ఛాన్స్ కేటీఆర్ కు లేకపోవడంతో నిరాశకు గురైనట్లుగా తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానికి ఎన్నో ప్రాజెక్టులు అందించింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. అదానీకి ప్రాజెక్టులు ఇచ్చినందుకు కెసిఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలా అంటూ ప్రశ్నించి, తాను అదానీ నుండి విరాళాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఇచ్చిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ తప్పు పట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *