తెలంగాణ ప్రజలకు కొత్త ఏడాదిలో మరిన్ని పథకాల్ని అమలుచేసేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అధికారం చేపట్టిన 10 నెలలు కావాస్తున్నా.. ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడకపోవడం, లోబభూయిష్టమైన గత సర్కార్ నిర్ణయాల్ని సరిదిద్దేందుకే సరిపోయిందని ఇప్పటికే అనేక సార్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో.. ఇక తాము ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త ఏడాది నుంచి మహిళల, పేద వర్గాల్లోని పిల్లల పెళ్లిలకు సర్కార్ తరఫున అందించే బహుమతుల్ని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే.. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని అమలు చేయనుంది. ఇకపై రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ డబ్బులతో పేద వర్గాల్లోని మహిళలు తమ కాళ్లపై తామే స్వయంగా నిలబడాలనే సంకల్పాన్ని నెరవేర్చేందుకు సిద్ధమవ్వాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్రంలోని చాలా మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. దీనికోసం భారీ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. అయినా కానీ.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెల మహిళల ఖాతాల్లో రూ. 2,500 వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు .
ఇక పేదింట పెళ్లిలకు పెద్ద దిక్కుగా నిలుస్తామంటూ.. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పేద, మధ్యతరగతి వర్గాలకు చేరువయ్యారు. వారికి ఇస్తామని హామి ఇచ్చినట్లుగా కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా.. పేదింట పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తులం బంగారాన్ని అందించనున్నారు. పెళ్లికి డబ్బులను ఇప్పటికే అందిస్తున్న ప్రభుత్వం.. మరింత సాయం చేయాలనే ఉద్దేశ్యంతో బంగారాన్ని కానుకగా అందించనుంది. ఈ పథకాన్ని కొత్త ఏడాదిలోనే అమలు చేయనున్నారు.
రైతులకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఆలోచన చేసిన రైతు భరోసా పథకానికి నూతన ఏడాదిలో శ్రీకారం చుట్టనున్నారు. ఏటా రైతులకు పంట సాయంగా అందించనున్న మొత్తాన్ని ఏ మేరకు ఇవ్వాలి, ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయమై నియమించిన క్యాబినేట సబ్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆయా సూచనలు, సలహాల మేరకు రైతులకు తోడుగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని గడ్డం పసాద్ వెల్లడించారు.
గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారన్న ప్రసాద్ కుమార్.. డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో.. రాష్ట్రంలోని వేల మంది సర్పంచులకు మేలు చేకూరుతుందని, వారందరి నిరీక్షణకు తెరపడనుందని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రూ. లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారని విమర్శించారు.