లగచర్ల దాడి కేసు.. కీలక నిందితుడు సురేష్‌ స్టేట్‌మెంట్‌, ఊహించని పేర్లు..!

లగచర్ల దాడి కేసు విచారణ వేగంగా జరుగుతోందా? కీలక నిందితుడు సురేష్ లొంగిపోవడంతో మరిన్ని అరెస్టులు తప్పవా? రాకెట్ వేగంతో తిరిగొస్తానని ప్రధాన నిందితుడు ఎందుకన్నాడు? ఈ లెక్కన అసలు నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తాయి.

లగచర్ల దాడి కేసు విచారణ వేగంగా జరుగుతోంది. అసలు నిందితులు పట్టుబడడంతో దాడి వెనుక ఏం జరిగిందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఘటన తర్వాత ఎస్కేప్ అయిన కీలక నిందితుడు సురేష్. మంగళవారం నేరుగా పోలీసుస్టేషన్‌లో లొంగిపోవడం వెనుక ఎవరున్నారు? ఎనిమిది రోజులు ఎక్కడున్నాడు? అనేదానిపై ఆరా తీస్తున్నారు.

సురేష్ తన ఫోన్ కాకుండా వేరే ఫోన్ వినియోగించినట్టు తెలుస్తోంది. సురేష్ కోసం పోలీసులు.. హైదరాబాద్, చేవెళ్ల, వికారాబాద్ తోపాటు ఢిల్లీ, కర్ణాటక, గోవా, పూణెలో కూడా గాలించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

సురేష్‌తోపాటు మరో నలుగురు నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. కొడంగల్ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. న్యాయస్థానం నుంచి నేరుగా సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. డిసెంబర్ నాలుగు వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నాడు.

ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు పలువురు ఇప్పటికే అరెస్టయిన విషయం తెల్సిందే. బీఆర్ఎస్ నేతలే వెనుకుండి ఈ దాడి చేయించారని కాంగ్రెస్ నేతల ఆరోపణ. రైతులను రెచ్చిగొట్టి, అధికారులను చంపేందుకు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు.

బుధవారం 12 గంటలకు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. రైతులు జైలుకి వెళ్లడానికి పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కారణమని భావిస్తున్నారు. చర్చల ప్రారంభం దశలో ఇలా జరగడంతో అధికారులు షాకయ్యారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉపయోగించినట్టు సమాచారం.

సురేష్ లొంగిపోవడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగడం ఖాయమని అంటున్నారు. త్వరలో మరిన్ని అరెస్టులు తప్పవని అంటున్నారు. సురేష్ అరెస్టయిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. రాకెట్ వేగంతో తిరిగి వస్తానని మీడియాతో వ్యాఖ్యలు చేశాడు. ఈ లెక్కన అసలు నిజాలు చెప్పి ఆయన బయటపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *