ఇవే వైసీపీ వారసత్వ సంపద.. 150 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ మాట..

వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కూటమి ప్రభుత్వం ఐదు నెలల కాలంలో ఏమి చేసిందనే దానికంటే, గత ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ సంపద గురించి వివరించారాయన. సింపుల్‌గా చెప్పాలంటే వైసీపీని ఏకి పారేశారు.

 

కూటమి ప్రభుత్వం 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వారసత్వంగా వచ్చిన కొన్ని విషయాల గురించి చెప్పారు.

 

వైసీపీ ప్రభుత్వం నుంచి గుంతలు, పాడైన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీ, రివర్స్ టెండర్లు, నిర్వీర్యమైన పంచాయితీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని నిధులు, రామతీర్థంలో రాముల వారి విగ్రహం డ్యామేజ్, 219 ఆలయాలు అపవిత్రత, మద్యం దోపిడీ, ఎర్రమట్టి దిబ్బల దోపిడీ, కూల్చివేతలు వంటివి వారసత్వంగా వచ్చాయన్నారు.

 

భవిష్యత్తుపై విశ్వాసాన్ని సీఎ చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. ఈ విషయంలో తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి బలంగా చెప్పలేకపోయానని అన్నారు.

 

రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ (7 లక్షల 65 వేల కోట్ల)గా అందుకుంటుందని మనసులోని మాట బయటపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వ ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు బలిదానం రోజున ప్రభుత్వం అధికార దినంగా జరుపుకోవాలని నిర్ణయించడం మంచి పరిణామంగా చెప్పుకొచ్చారు.

 

గత ప్రభుత్వంలో ఒకటిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు డిప్యూటీ సీఎం. ప్రస్తుత ప్రభుత్వం ఒకటిన జీతాలు వేస్తున్నారని తెలిపారు. 64 లక్షల లబ్దిదారులకు 4000 పింఛన్లు ఇవ్వడం ఆశామాషీ విషయం కాదన్నారు. పంచాయితీలను బలోపేతం చేశామన్నారు. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమైందన్నారు.

 

కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందుతున్నాయని వెల్లడించారు పవన్. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయని అన్నారు.

 

క్రైసిస్ వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనేది కళ్లకు కట్టినట్టు విజయవాడ వరదల్లో చూశానన్నారు. ప్రజల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లడమే కాదు.. యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్లిన తీరు బాగుందన్నారు. జల్ జీవన్ మిషన్‌ కార్యక్రమాలను ఓ మోడల్‌గా చేస్తామన్నారు.

 

శాంతి భద్రతల విషయంలో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విధానం, గంజాయి అరికట్టేందుకు ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉక్కుపాదంతో అణిచి వేశారని వివరించారు. ఈ విషయంలో సీఎం, హోంమంత్రి తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.

 

ముఖ్యమంత్రి విజన్‌కు అనుగుణంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. మరో దశాబ్దంపాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుతూ తన ప్రసంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *