రాష్ట్ర అప్పుల లెక్కలపై అసలు నిజాలు ఇవీ అంటున్న జగన్..

అసెంబ్లీలో అధికార కూటమి విమర్శలకు వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ద్వారా సమాధానాలు ఇచ్చారు. తన హయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, గతంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో వివరించారు.

 

తాడేపల్లి నివాసం నుంచి మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, అతని పరివారమంతా అబద్దాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తన హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశామంటూ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చిన జగన్.. అనేక లెక్కల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.

 

2019లో చంద్రబాబు అధికారం దిగిపోయేటప్పటికి రూ. 2 లక్షల 57 వేల కోట్ల అప్పులున్నాయని తెలిపిన జగన్.. ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు రూ. 55 వేల కోట్లని వెల్లడించారు. మొత్తం రూ. 3 లక్షల 13 వేల కోట్లని అన్నారు.

 

ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయో సమయానికి రూ. 4 లక్షల 91 వేల కోట్ల అప్పులు ఉన్నాయని జగన్ ప్రకటించారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్షా 54 వేల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం కలిపి.. రూ.6 లక్షల 46 వేల కోట్లు అని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన కాంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ (CAG) సైతం నిర్థరించిందని తెలిపారు.

 

ఈ నివేదికను స్వయంగా చంద్రబాబు నాయుడే.. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్న వైసీపీ అధినేత జగన్.. 2023 -24 కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏపీ అప్పు రూ. 6 లక్షల 46 వేల కోట్లని గణాంకాలతో సహా నిర్ధరణ అయ్యిందని వెల్లడించారు. మరి అలాంటప్పుడు.. కూటమి నాయకులు రూ. 12 లక్షల కోట్లని ఓ సారి, రూ. 14 లక్షల కోట్లు అప్పులున్నాయని మరోసారి ప్రచారం చేసారంటూ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *