రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జార్ఖండ్ లోనూ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదలకు పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే వీరందరినీ గతం వెంటాడుతోంది.
ఈసారి ఎగ్జిట్ పోల్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గతంలోనూ ఓ విధమైన ఉత్కంఠ ఉండేది. అప్పట్లో ఎన్నికల్లో ఎవరు గెలబోతున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అసలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, కాకపోతే పరిస్ధితి ఏంటి, అయితే పరిస్ధితి ఏంటన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకుని భారీగా నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు.
అంతెందుకు తాజాగా హర్యానా ఎన్నికలు, అంతకు ముందు ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీంతో ఏమాత్రం తేడా వచ్చినా ఆయా పార్టీలు, అభ్యర్ధులపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.