నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభలో తన సతీమణిని కించపరిచి మాట్లాడిన వేళ, ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభలో అడుగుపెడతానంటూ సీఎం చంద్రబాబు శపథం పట్టిన విషయం తెలిసిందే. ఆ శపథానికి నేటికి మూడేళ్లు పూర్తవగా, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ మరణ శాసనం రాసుకొని నేటికి మూడేళ్లు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ కళ్లు తెరవాలి. లేకుంటే రాజకీయ సమాధికి సిద్దమవడమేనంటూ విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నాటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు మాట్లాడే సమయంలో మైక్ ఇవ్వలేదని అసెంబ్లీ లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరెత్తి వైసీపీ సభ్యులు చేసిన కామెంట్స్ పై చంద్రబాబు మాట్లాడుతూ.. మహాభారతంలో కౌరవ సభను తలపించేలా.. రాజకీయాలతో సంబంధంలేని తన సతీమణి పేరెత్తి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తాను శాసనసభలో ముఖ్యమంత్రి గానే అడుగు పెడతానంటూ శపథం చేశారు.
ఆ త్వరాత ఎన్నికలు జరిగాయి. ఫలితాలు తారుమారయ్యాయి. టీడీపీ కూటమి రాష్ట్రంలో ఏకంగా 164 స్థానాలలో విజయాన్ని అందుకోగా, 11 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. వైసీపీకి ప్రతిపక్ష హోదాకు తగ్గ సంఖ్య కూడా లేని పరిస్థితుల్లో, ఇటీవల ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని సైతం జగన్ ఆశ్రయించారు.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాడు శాసనసభలో చేసిన శపథానికి నేటికీ మూడేళ్లు పూర్తయ్యాయి. దీనితో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ ద్వారా వైసీపీ పై విమర్శలు గుప్పించారు. నాడు శాసనసభలో సీఎం చంద్రబాబును అవమానించారని, అది కూడా చాలక అరెస్టు చేసి వికృతానందం పొందిన వైసీపీకి ప్రజలు చావు దెబ్బ కొట్టేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా శాసనసభకు కూడా రాకుండా మిగిలిపోయిన పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ అండ్ గ్యాంగ్ ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హోం మంత్రి ట్వీట్ చేశారు. హోం మంత్రి చేసిన ట్వీట్ పై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.