తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నయనతార జీవితంలో ఇంతవరకూ జరిగిన సంఘటనలపై ‘నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందింది. ఈ రోజు నుంచి ఈ డాక్యుమెంటరీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార మాట్లాడుతూ .. “నా బాల్యం చాలా సాదాసీదాగా సాగిపోయింది. నాన్న ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలకు తిరగడం జరిగింది. అమ్మానాన్నల వ్యక్తిత్వం ప్రభావం నాపై ఉంది” అని ఆమె చెప్పారు.
“నేను సినిమాలు ఎక్కువగా చూసేదానిని కాదు .. సినిమాలలో చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అలాంటి నేను డిగ్రీ చదువుతూ ఉండగా సినిమా ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరినీ నమ్మేసేదానిని. ఏ రిలేషన్ అయినా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. అవతలవారు కూడా సిన్సియర్ గా మనల్నే ప్రేమిస్తున్నారని అనుకుంటాం. గతంలో నా రిలేషన్ గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు. జనాలు ఎవరికి తోచినట్టుగా వారు .. ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుకున్నారు” అన్నారామె.
“నా రిలేషన్ కి సంబంధించి అంతా నాదే బాధ్యత అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ జరిగి చాలా కాలమే అయినా, సందర్భం వస్తే చాలు .. మొదటి నుంచి రాసుకొస్తున్నారు. ఇందుకు కారణమైన మగవారిని ఎవరూ అడగకపోవడం అన్యాయం అనిపిస్తూ ఉంటుంది. ‘శ్రీ రామరాజ్యం’ నా చివరి సినిమా అనుకున్నాను. ఆ తరువాత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను సినిమాలు మానేయమని చెప్పాడు .. ఇండస్ట్రీని వదిలేయమని అన్నాడు” అని చెప్పారు.
” ఆ సమయంలో నాకు వేరే మార్గం కనిపించలేదు. కానీ ఆ రోజున పరిపక్వత లేకపోవడం వలన నేను ఆ నిర్ణయానికి వచ్చానేమోనని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నన్ను నేను నిరూపించుకుంటూ, పరిస్థితులతో పోరాడుతూ ముందుకు వెళుతున్నాను. మొదటి నుంచి కూడా నా పని నేను చేసుకుపోవడం నాకున్న అలవాటు. మనం కాస్త రిలాక్స్ అయితే, మరొకరు ఆ స్థానాన్ని లాక్కుంటారు. అందువల్లనే నేను పరిగెడుతూనే ఉన్నాను .. పరిగెడుతూనే ఉంటాను” అని చెప్పారు.