మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డుదారులకు ఓ ముఖ్య సూచన చేసింది. ఇప్పటి నుండి ఆధార్ కార్డులో జనన తేదీ మార్పు కొరకు కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ ప్రామాణికంగా మారింది. మన గుర్తింపును తెలియజేసే కార్డుగా ప్రజల్లోకి వచ్చిన ఆధార్ కార్డు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. బ్యాంక్ ఖాతా, పంట భీమా, పింఛన్, ఇలా ఒక్కటి కాదు, ఎన్నో పథకాలకు ఆధార్ ఆధారమే. అయితే ఇందులో పొందుపరిచిన మన వివరాల ఆధారంగా మన గుర్తింపును ఇట్టే కనిపెట్టొచ్చు. ఆధార్ పై ఉండే 12 అంకెల నెంబర్ మన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది.
అయితే వయస్సు ధృవీకరణ నిర్ధారించేందుకు ఆధార్ తప్పనిసరిగా మారిన వేళ, ఆధార్ లో తప్పుగా నమోదైన జనన వివరాలను మార్చుకొనేందుకు ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ప్రధానంగా ప్రభుత్వం మంజూరు చేసే వృధ్యాప్య పింఛన్ కు ఆధార్ ప్రామాణికంగా మారింది. అయితే గతంలో ఆధార్ లో తప్పులు దొర్లితే, సులభతరంగా మార్చేవారు. అయితే ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించి, ఆధార్ లో మార్పుల కొరకు కఠినతర నియమ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
ఆధార్ లో జనన తేదీ మార్పుకు విద్యా ధృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకొనేవారు. కానీ కొంత వయస్సు అధికంగా ఉన్న వారికి మాత్రం కొంత ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. కారణం వారి వద్ద విద్యా ధృవీకరణ పత్రాలు లేకపోవడం ఒక కారణం కాగా, అలాగే ఆ పత్రాలలో వివరాలు సక్రమంగా కనిపించకపోవడం కూడా ఒక సమస్య. ఇలాంటి వారి కోసమే ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది.
అదేమిటంటే.. ఆధార్ కార్డులో పుట్టినరోజు తేదీ మార్పు కొరకు ఇప్పటి నుండి ప్రభుత్వ వైద్యులు నిర్ధారించిన వయస్సు ధృవీకరణ పత్రాలను కూడా, పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ వైద్యులు అందించే ఈ పత్రాలు క్యూఆర్ కోడ్ ని కలిగి ఉండాలని, ఈ విషయాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది గమనించాలని సూచించింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులో జనన తేదీని మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.