ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం.. యావత్ దేశాన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇక్కడి వైద్య కళాశాలలో సంభవించిన ఈ దుర్ఘటనలో 10 మంది అప్పుడే పుట్టిన శిశువులు సజీవ దహనం కావడం- విషాదంలో ముంచెత్తింది.
మహారాణి ఝాన్సీ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి ఈ పెను విషాదకర ఘటన సంభవించింది. రాత్రి 10:45 నిమిషాల సమయంలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. అక్కడున్న వస్తువులు, ఇతర పరికరాల వల్ల మంటలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. ఎన్ఐసీయూ మొత్తం మంటల బారిన పడింది.
l
ఈ ఘటనలో 10 మంది నవజాతా శిశువులు సజీవ దహనం అయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. వారిని మరో వార్డుకు తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నామని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యుట్ వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్, డివిజినల్ కమిషన్ విమల్ దుబే ఆసుపత్రికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. 10 మంది నవజాతా శిశువులు మరణించినట్లు తెలిపారు. పలువురు గాయపడ్డారని, వారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే అత్యవసర సమీక్షను నిర్వహించారు. ఈ అగ్నిప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించారు. మూడు వేర్వేరు విభాగాలు- పరిపాలన పరమైన విచారణ, పోలీసు యంత్రాంగంతో సమగ్ర దర్యాప్తు, న్యాయ విచారణ జరిపించనున్నట్లు బ్రజేష్ పాఠక్ తెలిపారు.