ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. శాసనసభ వేదికగా ఒకప్పుడు రాజకీయాలు నడిచేవి. ఈసారి మండలి వేదికైంది. మండలి వేదికగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జగన్ ఆలోచనలు బూమరాంగ్ అవుతున్నాయి. నమ్మకున్న సభ్యులు ఆయన్ని నట్టేట ముంచుతున్నట్లు కనిపిస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మండలిలో కూటమి బిల్లులు ఎలా పాస్ అయ్యాయి? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు సర్కార్‌తో నేరుగా ఫైట్ చేయలేకపోతున్నారు జగన్. నేతలు మీరు పోరాటం చేయండి.. వెనుక ఉంటానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలే ఇందుకు కారణం.
శాసనసభ సమావేశాలకు తాము రామని ముఖం చాటేశారు జగన్. మండలికి వైసీపీ సభ్యులు వస్తారని చెప్పారు. అలాగే వెళ్తున్నారు కూడా. కాకపోతే కూటమి బిల్లులకు వైసీపీ నేతలు సపోర్టు చేసినట్టు కనిపిస్తోంది. అదెలా అంటారా? అక్కడికే వచ్చేద్దాం.
మండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో 8 మంది నామినేటెడ్ నేతలతో కలిసి ఆ పార్టీకి సుమారు 39 మంది ఉన్నారు. అందులో 31 మందిని నమ్మిన బంటులను ఏరికోరి మండలికి పంపారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ-జనసేన కూటమికి కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇండిపెండిట్లు 4, పీడీఎఫ్ సభ్యులు ఇద్దరున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే మండలిలో వైసీపీదే ఆధిపత్యం. శాసనసభలో ఆమోదం చెందిన కూటమి బిల్లులు, మండలిలో వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఆయా బిల్లులు తప్పనిసరిగా ఆగిపోవాల్సిందే. గతంలో టీడీపీ అపోజిషన్‌గా అదే జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో పాసైన బిల్లులు, మండలిలో రద్దవుతున్నాయి. ఆ లెక్కన వైసీపీ సభ్యులు మద్దతు ఇస్తున్నట్లేనా?
అందులో ఒకటి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు బిల్లు కాగా, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు. ఈ రెండింటిని అప్పటి జగన్ సర్కార్ ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చింది. వీటిపై కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు మండలిలో పాసైనట్టు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి బిల్లులను వ్యతిరేకించాల్సిన వైసీపీ, మండలిలో ఆమోదం పొందుతున్నాయంటే ఏదో జరుగుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
వైసీపీ సభ్యులు, కూటమికి మద్దతు ఇస్తున్నారా? లేకపోతే జగన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? ఎమ్మెల్సీలు అందుబాటులో లేకపోవడం బిల్లులు పాసవుతున్నాయా? బిల్లులపై చర్చ సమయంలో సభ్యులు వాకౌట్ అవుతున్నారా? కొందరు కూటమి వైపు వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరికొందరు కావాలనే దూరంగా ఉంటున్నారట. ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతుందన్నాయి.
మొన్నటికి మొన్న ప్రెస్‌మీట్‌లో జగన్ ఓ విషయాన్ని బయటపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ట్వీట్ పెడతానని, మీరు పెట్టాలంటూ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కూటమి సర్కార్ ఎంతమందిని జైలుకి పంపిస్తుందో చూద్దామని కాసింత ఆవేశంతో అన్నారు జగన్.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను గమనించిన కొందరు వైసీపీ హార్డ్‌కోర్ కార్యకర్తలు పెదవి విరిస్తున్నారు. నేతలు పైస్థాయిలో బాగానే ఉంటారు. మధ్యలో వెళ్లిన మనలాంటి వారు ఇబ్బందులు పడతారని ఓపెన్‌గా చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ తాను తీసుకున్న గోతిలో తనే పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.