తిరుమల టీటీడీ కొత్త బోర్డు ఏర్పడి రెండు వారాలు గడిపోయింది. ఛైర్మన్‌తోపాటు బోర్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తొలి సమావేశం జరిగిందా? జరగబోతోందా? బోర్డు ముందు ఉన్న లక్ష్యాలేంటి? ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? చట్టాలు ఏమైనా మారుస్తారా? ఉన్న చట్టాలకే పదును పెడతారా? ఇవే ప్రశ్నలు సామాన్య భక్తులను వెంటాడుతున్నాయి.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రతీ విభాగాన్ని క్షుణ్నంగా పరిశీలించారాయన. స్వయంగా భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు. కొత్త చట్టాలేవీ తీసుకు రాకుండా ఉన్నవాటికి పదును పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. తాము ఏ పని చేసినా బోర్డులో చర్చించిన తర్వాత, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీ చాలా చట్టాలు తీసుకొచ్చిందని, కొత్తగా తీసుకొచ్చేవి ఏమీ లేవన్నారు.
తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని, దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు టీటీడీ ఛైర్మన్. రాజకీయాలు మాట్లాడినవారు, వాటిని టెలికాస్ట్ చేసినవారిపై కేసులు పెట్టిస్తామన్నారు. తిరుమల పవిత్రను కాపాడడమే తమ ఉద్దేశ్యమన్నారు. గాలి వార్తలకు చెక్ పెట్టాలన్నది ఆయన ప్రధాన ఆలోచన.
ప్రస్తుతం బోర్డులో చాలామంది పెద్దవాళ్లు ఉన్నారని, గతంలో పని చేసిన అనుభవం ఉందన్నారు బీఆర్ నాయుడు. శ్రీవారి ఆస్తులను పబ్లిక్ డెమైన్‌లో ఉంచాలన్నది మరో ఆలోచన. శ్రీవారి నగదు ప్రైవేటు బ్యాంకులో ఉండడం సరికాదన్నారు.
పనిలోపనిగా శ్రీవాణి టికెట్లు విషయాన్ని ప్రస్తావించారు. దానికి సంబంధించిన టికెట్ల నిధులు నేరుగా శ్రీవారి ట్రస్టులో జమ అయ్యేలా మంతనాలు జరుపుతున్నారట. బోర్డు సభ్యుల ఆమోదం తర్వాత అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు.
భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు ఛైర్మన్ బీఆర్‌నాయుడు. శ్రీవారి దర్శనం పేరిట భక్తులను గంటల తరబడి కంటెయినర్‌లో లాక్ చేయడం కరెక్ట్ కాదన్నది ఆయన ఆలోచన. నీళ్లు, ఫుడ్, టిఫిన్ ఇస్తున్నారని అది సమస్య కాదని అన్నారు.
ఒక వ్యక్తిని అన్ని గంటలు నిర్బధించడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి భక్తులు తిరుమలకు వస్తుంటారని, కనీసం రెండు సెకన్ల పాటు దేవుడ్ని చూసే అవకాశం కల్పించలేకపోతున్నామని అన్నారు. అలాంటప్పుడు భక్తులకు శ్రీవారి మీద ఎలాంటి నమ్మకం కలుగుతుందని మనసులోని బాధను బయటపెట్టారు. అలాంటి భక్తులు మళ్లీ తిరుమల వస్తారా? అని అన్నారు.
గతంలో తిరుమలకు వచ్చే భక్తులకు టైమింగ్ ట్యాగ్ వేసేవారని, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. చాలామంది భక్తుల నుంచి సమాచారాన్ని సేకరించారాయన. తిరుమలకు వచ్చినా తమకు తృప్తిలేదని, వృద్దులమని చెప్పినా లాగి పారేస్తున్నారంటూ మొరపెట్టుకున్నారట.
టైమింగ్ ట్యాగ్ వేసి గంట లేదా రెండు సమయంలో దర్శనం జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదని, భక్తుడికి దర్శనమే ముఖ్యమంటున్నారు. దర్శనం అనేది భక్తులకు కరెక్ట్ టైమ్ ఇస్తే, చుట్టుపక్కల టెంపుల్‌ని సందర్శిస్తారని, వారికి కొంత తృప్తి కలుగుతుందని అంటున్నారు. బీఆర్ నాయుడు ఆలోచనలు కార్యరూపం దాల్చితే బోర్డు ఛైర్మన్‌గా భక్తుల మనసులో కలకాలం నిలిచిపోతారని అంటున్నారు శ్రీవారి భక్తులు.