కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు సన్నద్ధమౌతోన్నారు. కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాల ధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం నేడు అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 4 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు పీఎన్ మహేష్ నంబూద్రి ఆలయం గర్భగుడి తలుపులను తెరుస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభం అయినట్టవుతుంది.
శనివారం నుంచి భక్తులకు అయప్ప స్వామి దర్శనం కల్పిస్తారు. ఉదయం 11 గంటలకు పంపా నదీతీరం నుంచి భక్తులు శబరిమలకు బయలుదేరి వెళ్తారు. డిసెంబర్ చివరి వారం వరకూ ఆలయ తలుపులను తెరిచే ఉంచుతారు. అనంతరం మూసివేస్తారు. జ్యోతి దర్శనం కోసం జనవరి రెండో వారంలో ఆలయాన్ని తెరుస్తారు.
ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పస్వామివారిని దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది 15 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకున్నందున ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం ఇదివరకే శుభవార్త వినిపించిన విషయం తెలిసిందే. వారికి అయిదు లక్షల రూపాయల ఉచిత బీమా కవరేజీని ప్రకటించింది పినరయి విజయన్ సర్కార్. దర్శనానికి వెళ్లిన ఏ భక్తుడైనా సరే మరణించినా లేదా ప్రమాదం బారిన పడినా ట్రావెన్‌కోర్ దేవస్వొం బోర్డు అయిదు లక్షల రూపాయలు చెల్లిస్తుంది.
దురదృష్టవశావత్తూ ఎవరైనా మరణించితే వారి భౌతిక కాయాన్ని స్వస్థలాలకు తరలించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. యాత్ర సమయంలో అయ్యప్ప భక్తుల భద్రత కోసం 13,600 మంది పోలీసులు, 2,500 మంది అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందిని నియమించారు. 1,000 మంది శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు యాత్ర సాగే ప్రదేశాలు, అక్కడి పరిసరాలను శుభ్ర పరుస్తారు.
భక్తులు ప్రమాదాల బారిన పడితే తక్షణమే వారికి ప్రాథమిక చికిత్స అందేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. మెరుగైన చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నీలక్కళ్, సన్నిధానం, కొట్టాయం మెడికల్ కాలేజీ, పథినంథిట్ట, కంజీరపల్లి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.