వర్గ రాజకీయం- ఉప ముఖ్యమంత్రికి సీఎం కుర్చీ ఆఫర్ .

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.

 

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

 

అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.

 

ఈ పరిణామాల మధ్య మహాయుటిలో ముఖ్యమంత్రి అంశం తెర మీదికి వచ్చింది. ఈ ఎన్నికల్లో మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. సీఎం స్థానం కోసం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఇదే అంశంపై తాజాగా మహారాష్ట్రకే చెందిన కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందించారు. ప్రస్తుతానికి తమ ఏకాగ్రత మొత్తం కూడా ఎన్నికలపై ఉందని, ఈ రణంలో ఘన విజయం సాధించాలనే విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, వాటిపైనే తమ దృష్టి కేంద్రీకరించామని అన్నారు.

 

ఈ ఎన్నికల్లో మహాయుటి మళ్లీ అధికారాన్ని అందుకుంటుందనడంలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. తామే మళ్లీ విజయం సాధించగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికల గాలి మొత్త తమవైపే ఉందని స్పష్టం చేశారు.

 

ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సారథ్యంలో తాము ఎన్నికలను ఎదుర్కొంటోన్నామని నితిన్ గడ్కరీ చెప్పారు. అధికారంలోకి వస్తే- ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని పార్టీ హైకమాండ్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *