‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసి ‘ఆర్య’ చిత్రంతో అందరి హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్ ‘పుష్స’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ‘పుష్ప’ ది రైజ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’ ది రూల్‌లో నటిస్తోన్న అల్లు అర్జున్ ‘ఆహా’ పాప్యులర్ షో అన్‌స్టాపబుల్‌లో పాల్గొన్నాడు.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్‌షోలో బన్నీ (అల్లు అర్జున్) తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. ఈ రోజు నుంచి టాక్ షో ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్‌గా ఆయన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. అయితే ఈ అవార్డు గురించి అన్‌స్టాపబుల్ షోలో తను ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
”ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైమ్ ఇప్పుడు చెబుతున్నాను. నాకు సుకుమార్ ‘ ‘పుష్ప’ సినిమా కథ చెప్పగానే..నేను ఆయన్ని ఒక్కటే అడిగాను. ‘సినిమా హిట్ అవ్వాలని కూడా నేను కోరుకోవడం లేదు. నాకు మాత్రం ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలి. ఇది నువ్వు అనుకుంటేనే సాధ్యపడుతుంది. నేను ఒక్కడిని అనుకుంటే రాదు’ అని సుకుమార్‌ను కోరుకున్నాను. వెంటనే సుకుమార్ ‘ నీకు నేషనల్ అవార్డు రావడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను’ అన్నారు.
అంతేకాదు, సినిమా షూటింగ్‌లో నా మీద తీసే ప్రతి సన్నివేశాన్ని ఆయన సంతృప్తి పడే వరకు మళ్లీ రీటేక్‌లు చేసేవాడు. ‘డార్లింగ్ నేషనల్ అవార్డు రావాలంటే ఈ రేంజ్ సరిపోదు మళ్లీ చేద్దాం’ అనే వాడు. ప్రతి షాట్ టేక్‌కు మా మధ్య నేషనల్ అవార్డ్ డిస్కషనే ఉండేది. ఇలా నేషనల్ అవార్డు కొట్టాలని మనసులో ముందే వుండేది.
అవార్డు కొట్టిన తరువాత ఇప్పుడు చెబుతున్నా.. నా పేరు అర్జున్.. గురిపెట్టి నేషనల్ అవార్డు కొట్టాను. నాకు అది తప్ప ఆ సమయంలో ఏమీ కనిపించలేదు. సో.. నాకు ఇంత విలువైన ఈ అవార్డును మన తెలుగు హీరోలందరికి అంకితం చేస్తున్నాను” అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.