ఢిల్లీతో సంబంధాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేసారు. మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా పిచ్చి రాతలు ..పోస్టింగ్స్ పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఆర్దిక కష్టాల గురించి వివరించారు. గత అయిదేళ్ల కాలంలో జరిగిన పాలన పైన విమర్శలు చేసారు. రాష్ట్ర విభజన నష్టం కంటే వైసీపీ పాలనలో ఎక్కవ నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్రంతో సంబంధాల పైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

 

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పైన చంద్రబాబు ప్రసంగించారు. గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడాని చైతన్యంతో ఓట్లు వేశారని గుర్తు చేసారు. 2019లో ఒక్కఛాన్స్ అనేమాట చెప్పి అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని నాశనం చేసారని ఆరోపించారు. దాదాపు పది లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నట్లుగా ఇప్పటికీ లెక్కలు ఉన్నాయని స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హయాంలో జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. అమరావతికి లక్ష కోట్ల ఖర్చు అనే కారణంతో నిలిపివేసారని.. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా వివరించారు.

 

గత అయిదేళ్లు కాలంలో స్కీముల పేరుతో స్కాములు చేసారని ఆరోపించారు. అసమర్థ పాలనతో వ్యవస్థలను సైతం పక్కదోవ పట్టించారని విమర్శించారు. పోలవరాన్ని పూర్తిచేసి నదులు అనుసంధానం చేయాలి అంటే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో లక్ష 29వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని వెల్లడించారు. 9వేల కోట్లు కరెంటు వాడుకోకుండా వారికి బకాయిలు కట్టారని వివరించారు. రూ 7. 25 పైసలు పెట్టి ఓపెన్ మార్కెట్‌లో కరెంట్ కొన్నారని వెల్లడించారు. ఇసుకపైనా వ్యాపారం చేశారని.. దోపిడీ చేశారని ఆరోపించారు. రూ.30 వేల కోట్లు ఇసుకలో దోపిడీ చేశారని మండిపడ్డారు.

 

ఢిల్లీలో మన పలుకుబడి పెరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్రం ఏపీకి సహకారం అందిస్తుందన్నారు. కూటమి పైన ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని.. కలిసి కట్టుగా పని చేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. కాగా.. బడ్జెట్‌పై ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *