జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. గడిచిన ఐదేళ్లు సోషల్ మీడియా ద్వారా సైకోలను తయారు చేశారని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వారిని జీతాలు చెల్లించారన్నారు. చివరకు కన్నతల్లిపై పోస్టులు పెట్టారని దుయ్యబట్టారు. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా వర్ణించారు.
వీరు మనుషులా.. జంతువులా? అంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపైనా కఠినంగా వ్యవహరిస్తామని సభ వేదికగా చెప్పారు. చట్టానికి పదును పెడతామన్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నారు. ఆడ బిడ్డల జోలికొచ్చినవారిని ఉక్కుపాదంతో వారిని అణిచివేస్తామన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. అప్పటి ప్రభుత్వ జీవోలు, కాగ్ రిపోర్టులు సైతం బయట పెట్టలేదన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే విభజన కంటే.. ఐదేళ్లలో నాశనం చేసిందే ఎక్కువన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పినా వినలేదన్నారు ముఖ్యమంత్రి. అమరావతి గొప్ప నగరంగా తయారుకాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీశారని, నదులు అనుసంధానం అయితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదన్నారు.
వచ్చిన పెట్టుబడులను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. బడ్జెట్‌పై సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఆస్తులు సృష్టి లేదు.. సంపద లేదన్నారు. దీనివల్ల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులు తాకట్టు పెట్టారని గుర్తు చేశారు.
శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం రాజీ లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని భావిస్తే సహించేది లేదన్నారు. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అసెంబ్లీకి నేతలు రాకపోవచ్చు.. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు మొదలవుతున్నాయని తెలిపారు. నదులు అనుసంధానం అయితే కరువు అనే మాట రాదన్నారు. దక్షిణాదిలో ఇదే ఫస్ట్ రాష్ట్రం అవుతుందన్నారు.
రాష్ట్రాన్ని పెట్టుబడులు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఎం. తాను అన్నీ చేశామని చెప్పలేదన్న ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్య ఉండదని పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చామన్నారు.
ఎప్పుడూ చూడని విధ్వంసం రాష్ట్రంలో చూశామని, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు సీఎం చంద్రబాబు. అన్నింటినీ గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు చేయాల్సిన పనులు వేగంగా చేస్తున్నామని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక బెస్ట్ బడ్జెట్ అని, ఇది కేవలం కేంద్రం ద్వారానే సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చేసుకుంటూ వెళ్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మంచి ప్రభుత్వం- చెడు ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గుర్తించాలన్నారు. సభ్యులు అన్నివిధాలుగా సహరిస్తున్నారని, సభ నిండుగా ఉందన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చూస్తే.. కుర్చీ కూడా కళకళలాడుతోందని నవ్వుతూ అన్నారు ముఖ్యమంత్రి. ఇదే వాతావరణం నిత్యం ఉండాలన్నారు.