నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా.. అయితే నాదొక కోరిక ఉంది. అదొక్కటి తీరిస్తే నేను రాజకీయాలకు స్వస్తి పలికి కూర్చుంటానంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. మీరు సై అంటే నేను సై సై.. అంటాను. అసలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కాదు కేసు పెట్టాల్సింది.. మీపై పెట్టాలి కేసులు. అసెంబ్లీ లో మీ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా. మరి సిద్దమా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా నారా లోకేష్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇటీవల ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హద్దులు దాటిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా.. ఒక్కొక్కరిని వెలికితీస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ అరెస్టులపై వైసీపీ భగ్గుమంటుండగా, టీడీపీ మాత్రం మహిళల వ్యక్తిగత హనానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని చెబుతోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పర్వంపై ఓ ట్వీట్ చేశారు. అసలు కేసులు నమోదు చేయాలంటే ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు ఎందుకు పెట్టకూడదు తెలపాలంటూ ప్రశ్నించారు.
అలాగే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లు ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, నాడు సీఎం హోదాలో గల జగన్ ను ఏక వచనంతో విమర్శించారన్నారు. కేసులు పెడితే ముందుగా వీరిద్దరిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అంబటి రాంబాబు కొత్త నినాదం ట్వీట్ ద్వారా వినిపించారు.
ఇక నారా లోకేష్ ఇలా చేస్తే తాను తప్పనిసరిగా రాజకీయాల నుండి తప్పుకుంటానని మాజీ మంత్రి అంబటి సవాల్ విసిరారు. శాసనసభలో తన తల్లిని అవమానించారంటూ నిన్న లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ.. మీ తల్లిని అవమానించినటువంటి నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలకు స్వస్తి పలుకుతానని అంబటి అన్నారు. ఇటీవల కొంత స్తబ్దతగా ఉన్న అంబటి.. ఒక్కసారిగా తన ట్వీట్లతో విరుచుకుపడడంతో, వీటికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.