మహారాష్ట్ర ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రెండు కూటముల నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హోరా హోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే ఎంవీఏ కూటమిని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. యూపీ సీఎం యోగీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, తాజాగా మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే చేస్తున్న ఆరోపణల కు బీజేపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.
థాక్రే విమర్శలతో
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు పతాక స్థాయికి చేరాయి. ఎంవీఏ కూటమి పైన బీజేపీ కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే టార్గెట్ చేసారు. తాజాగా థాక్రే ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్మాల్ కు వెళ్లగా అక్కడ అధికారులు ఆయన బ్యాగ్ లు తనిఖీ చేసారు. దీని పై థాక్రే ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని, అమిత్ షా బ్యాగ్ లు చెక్ చేసారా అంటూ నిలదీసారు. ఇప్పుడు థాక్రే వ్యాఖ్యల పైన బీజేపీ స్పందించింది. థాక్రేకు కౌంటర్ ఇచ్చింది.
బీజేపీ కౌంటర్ ఎటాక్
థాక్రే ఆరోపణలకు సమాధానంగా ఒక వీడియో విడుదల చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాగ్‌ను కూడా చెక్ చేసినట్లు స్పష్టం చేసింది. పఢ్నవీస్ కొల్హాపూర్, యావత్మాల్ లో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆయన బ్యాగులను అధికారులు తనిఖీ చేసారని వెల్లడించింది. అయినా, ఈ తనిఖీలకు సహకరించిన ఫడ్నవీస్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికారులు రాజ్యాంగ విధులు నిర్వహిస్తారని.. ప్రతీ నేతా సహకరించాల్సిందేనని పేర్కొంది. ప్రతీ విషయాన్ని రాజకీయంగా వివాదం చేయటం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీఈసీ క్లారిటీ
థాక్రే ఎన్నికల ప్రచారం కోసం యావత్మాల్ కు వెళ్లిన హెలికాప్టర్ లో అధికారులు తనిఖీలు చేసారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ ముఖ్యలు బ్యాగులు కూడా చెక్ చేయాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. మోదీ బ్యాగులను తనిఖీ చేసి తనకు చూపించాలని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల పైన ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ముఖ్య నేతల హెలికాఫ్లర్లలోనూ సోదాలు చేస్తామన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేసారు. నిబంధనల మేరకే థాక్రే బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేసారని తేల్చి చెప్పారు. ఇక, పోలింగ్ కు సమయం సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఏర్పాట్లును ముమ్మరం చేసింది.