20 లక్షల ఇళ్లు కట్టిస్తాం..! ఇందిరమ్మ ఇళ్ల పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి..

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Pongulati) గుడ్ న్యూస్ చెప్పారు.. రాష్ట్రంలో పేద వర్గాల కోసం తర్వలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్(Prajabhavan) లో మంత్రితో ముఖాముఖి సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న పొంగులేటి.. అనంతరం తన వద్దకు వచ్చిన సమస్యల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ప్రజలు ఇళ్ల సమస్యల్ని తీసుకువచ్చారని, గత ప్రభుత్వాలు మాదిరి తాము మాటిచ్చి, తప్పించుకోమని ప్రకటించారు. దాంతో పాటే అనేక ఇతర విషయాల్ని తెలిపారు.

 

రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎలాంటి రికమండేషన్లు అవసరం లేదన్న మంత్రి పొంగులేటి.. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను(Indhiramma Houses) అందిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని.. గ్రామాల్లో సభలు నిర్వహించి, అందులో నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేసిన మంత్రి పొంగులేటి.. వచ్చే నాలుగేళ్లల్లో మొత్తంగా 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. తొలి ప్రాధాన్యంగా.. ఇళ్ల స్థలం ఉన్న లబ్ధిదారులకు డబ్బులు అందిస్తామన్న మంత్రి పొంగులేటి, తర్వాత ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే స్థలంతో పాటుగా ఇళ్లను అందిస్తుందని తెలిపారు.

 

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు కచ్చితంగా 400 చ.అ స్థలంలో ఇల్లు నిర్మించాలని, అందులో తప్పనిసరిగా వంటగది, బాత్రూమ్ ఉండాలని చెప్పారు. అలాగే.. ప్రజల అవసరాల మేరకు, 4 విడుతల్లో రూ. 5 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడుతగా పునాది స్థాయి పూర్తయిన ఇళ్లకు రూ.1 లక్ష, దర్వాజ స్థాయికి వచ్చాక మరోక రూ.1.25 లక్షలు అందిస్తామన్నారు. ఇల్లు స్లాబ్ స్థాయికి వచ్చాక రూ.1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన రూ.1 లక్ష రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అడబిడ్డల పేరుతోనే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగోలేదని తెలిపిన మంత్రి పొంగులేటి.. అయినా ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు.

 

కొత్త ఆర్ఓఆర్ చట్టం.. సకల సమస్యలకు పరిష్కారం

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూముల కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన మంత్రి పొంగులేటి.. ప్రస్తుత సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆర్ఓఆర్ 2024 (ROR 2024) కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు ప్రకటించారు.

రానున్న కొద్ది రోజుల్లోనే దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇందుకోసం.. రాష్ట్రంలోని మేధావులు, నిపుణుల సలహాలు తీసుకున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు అందించిన మంచి సూచనలను కూడాపరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

ధరణిని పీకి పారేస్తాం..

కేసీఆర్ పాలనలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. ధరణి (Dharani) పేరుతో దోపిడీలకు పాల్పడిందన్న పొంగులేటి.. ఆ కారణంగానే ఎన్నికల సమయంలో ధరణీని పీకి బంగాళాఖాతంలో పడేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తప్పుల్ని తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని, ఇక్కడి భూముల్ని విదేశీయులకు తాకట్టు పెట్టిన తప్పును సరిదిద్ది.. తాము ఎన్ఐసీ(NIC) కి భూముల రికార్డు బాధ్యతలు అప్పగించినట్లు గుర్తుచేశారు.ఆనాటి పెద్దల కనుసన్నల్లో చాలా మంది భూముల్ని మాయం చేశారని, వాటన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని.. పేదవారికి అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

 

నిరుద్యోగులు, రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

 

ఈ ముఖాముఖిలో కొందరు నిరుద్యోగులు కూడా తన వద్దకు వచ్చారన్న మంత్రి పొంగులేటి.. గడిచిన 11 నెలలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటికే.. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు పరీక్షలు పూర్తయ్యాయని, వాటి ఫలితాల్ని ప్రకటించి, ఉద్యోగ భర్తీలు చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన కొంత మంది రైతులకు రుణమాఫీ కొంత పెండింగ్ ఉందన్న మంత్రి పొంగులేటి.. ఇందిరమ్న రాజ్యంలో మోసం జరగదని, అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కేవలం 27 రోజుల్లో్నే రూ.18 వేల కోట్ల రుణ బకాయిలు తీర్చామన్నారు. ఇంకా 13 వేల కోట్ల బకాయిల్ని రద్దు చేయాల్సి ఉందని.. వాటిలో కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయని అన్నారు. రెండు లక్షలకు మించి అప్పులున్న వారు.. ప్రభుత్వం తీర్చనున్న రుణానికి అధనంగా ఉన్న సొమ్ముల్ని బ్యాంకులో కట్టేయాలని అన్నారు.

 

మేము చేస్తున్న అప్పులు.. గత ప్రభుత్వ అప్పులు, అసలు కట్టేందుకే సరిపోతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని నడిపిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజని కొంటామన్న మంత్రి పొంగులేటి.. జిల్లాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెస్పీ కంటే అదనంగా రూ.500 ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఎవరూ ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు.. కొందరు పచ్చరంగు కండువాలు కప్పుకుని రోడ్లపైకి వస్తున్నారని, కానీ… వారంతా అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టించారని గుర్తుచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *