విశాఖపట్నం మెట్రోపై ఏపీ అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరిగింది. దీనిపై విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి నారాయణ సభలో ఓ ప్రకటన చేశారు.
కలకత్తా మెట్రో తరహాలో 100శాతం కేంద్రప్రభుత్వం భరించేలా విశాఖ మెట్రో ప్రతిపాదనలు రైల్వే శాఖ ముందు ఉంచామన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి లేఖ ఇచ్చామన్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు.
మొదటి కారిడార్‌ను స్టీల్‌ప్లాంట్-కొమ్మాది జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, రెండో కారిడార్‌లో గురుద్వార-ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు ఉందన్నారు మంత్రి. మూడో కారిడార్‌లో తాటిచెట్ల పాలెం-చిన వాల్తేరు వరకు 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు.
మొత్తంగా 46.23 కిమీ మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. మంత్రి నారాయణ ప్రకటనపై జనసేన సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడారు. మెట్రో కోసమే అనకాపల్లి మున్సిపాలిటీని విశాఖలో కలిపారన్నారు. ఎక్కువ వాహనాలు అనకాపల్లి రూట్లోనే వెళ్తున్నాయన్నారు. కనీసం లంకెలపాలెం వరకు మెట్రోని పొడిగించాలన్నారు.
అటు విశాఖ సిటీ టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణ మాట్లాడారు. నవంబర్ మూడున సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖలో రివ్యూ జరిగిందన్నారు. నాగ్‌పూర్ మాదిరిగా రోడ్డు, ఫ్లైఓవర్, ఆపై మెట్రో నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మధురవాడ-తాటిచెట్లపాలెం, గాజువాక-లంకెలపాలెం వరకు మెట్రో వేయాలని ప్రతిపాదనలు చేశామన్నారు. మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే ట్రాఫిక్ మరింత పెరుగుతుందన్నారు. మెట్రోపై మంత్రి చేసిన ప్రకటన 2018 ప్రతిపాదన లేక 2024 లోదా అనేది చెప్పాలన్నారు.
బీజేపీ విష్ణుకుమార్ రాజ్ మాట్లాడుతూ విశాఖ మెట్రో ఫస్ట్ ఫేజ్ కేవలం కొమ్మాది వరకు మాత్రమే ఉందన్నారు. మరో ఆరు కిలోమీటర్లు పెంచితే బాగుంటుందన్నారు. దీనివల్ల గంభీరంలో ఐఐఎం, మిగతా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అటు భీమిలి వెళ్లడానికి బాగుంటుందన్నారు. దీనిపై కేంద్రాన్ని కోరాలన్నారు.
సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై మంత్రి నారాయణ రిప్లై ఇచ్చారు. గతంలో చేసిన డీపీఆర్ ఐదేళ్లు దాటిపోవడంతో మళ్లీ కొత్తది తయారు చేసి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం, లేఖ రాయడం జరిగిందన్నారు. రెండు దశలో మెట్రోని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.