ఓ వైపు పోలీసుల దెబ్బలు తగులుతుంటే, మరో వైపు సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలు చూసి ఆనందపడ్డారట. ఈ మాటలు విని వెంటనే ఉండి ఎమ్మేల్యే రఘురామ కృష్ణంరాజు కేసు గుర్తుకు వచ్చింది కదా.. ఔను అదే తరహాలో వైసీపీకి చెందిన మహిళా నేత, మాజీ మంత్రి కూడా టీడీపీ కార్యకర్తలను పోలీసులు కొడుతుండగా, సెల్ ఫోన్ ద్వారా లైవ్ దృశ్యాలను చూస్తూ పరవశించి పోయారట. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరంటే విడదల రజిని. ఈ ఆరోపణలు చేసింది ఎవరంటే టీడీపీ కార్యకర్త పిల్లి కోటి.
అంతా సేమ్ టు సేమ్. సీన్ టు సీన్ అంతా ఒకటే. కానీ రఘురామకృష్ణం రాజు కేసును పోలినట్లే. తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో, ముసుగులు ధరించిన వ్యక్తులు వచ్చి తనను కొట్టారని, అయితే తనను కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా ఎవరో పెద్దాయన చూసి పరవశించి పోయాడంటూ ఉండి ఎమ్మెల్యే త్రిబుల్ ఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు అంతు తేల్చే పనిలో పోలీసులు కూడా స్పీడ్ పెంచారు. ఇదే తరహాలో తనను కూడా కొట్టారంటూ చిలుకలూరిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు తాజాగా పల్నాడు ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
చిలుకలూరిపేటకు చెందిన పిల్లి కోటి, పలువురు టీడీపీ శ్రేణులు బుధవారం పల్నాడు ఎస్పీని కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడదల రజిని, టీడీపీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను చిత్రహితులకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడదల రజిని పైశాచిక ఆనందం పొందినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని, రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ, రజిని పీఎ లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావును కోరారు. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం ఏపీలో సాగుతుండగా, మాజీ మంత్రి విడదల రజిని, పలువురిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మరి ఈ కేసును పోలీసులు ఏ రీతిలో దర్యాప్తు చేస్తారో తేలాల్సి ఉంది.