వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై జరిగిన దాడికి అధికారుల వైఫల్యమే కారణం అని అసహనం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనపై శ్రీధర్ బాబుతో కలెక్టర్, ఎస్పీ, ఐజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దాడి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్రామస్థులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ కండ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుట్రను పసిగట్టడంలో ఇంటిలిజెన్స్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుండి గ్రామస్తులతో భేటీ అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ జేఏసీ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉద్యోగస్తులపై దాడి జరిగితే ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఖండించకపోగా వాళ్లను సమర్దించడాన్ని వ్యతిరేఖిస్తున్నామన్నారు. గతంలో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి చంపారని, అలాంటి ఘటనలు పురికొల్పేలా చేయవద్దని అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నిరసన తెలపవచ్చని, కానీ లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకుని దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అలా దాడులు చేయడం వల్ల ఉద్యోగులు ఏ పని చేయడానికి ముందుకు వెళ్లరని, దాని వల్ల ప్రజలకే నష్టమని హెచ్చరించారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. పోలీసులు ప్రతి ఉద్యోగికి రక్షణ ఇవ్వడమనేది సాధ్యం కాదని కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.