కేశవ్ బడ్జెట్‌లో ఆ రెండు రంగాలకు ప్రయార్టీ..!

అసెంబ్లీ బడ్జెట్‌లో ఏ శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించారు? కేవలం రెండు రంగాలకు అగ్ర తాంబూలం వేశారా? రానున్న ఆరునెలల కాలానికి సంబంధించి బడ్జెట్ మాత్రమేనా? కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చిన ఆ రంగాలేంటి? ఒక్కసారి డీటేల్స్‌లోకి వెళ్దాం.

 

సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తి కావడంతో.. మరో ఆరునెలలకు మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్న మంత్రి పయ్యావుల, రాష్ట్ర పునర్నిర్మాణమే అజెండాగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు చెప్పుకొచ్చారు.

 

2019-2024 మధ్య కాలాన్ని చీకటి దశగా తన ప్రసంగంలో ప్రస్తావించారు విత్త మంత్రి. ప్రజావేదికను కూల్చివేత నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు, మూడు రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురి చేసిందన్నారు. దీని ఫలితంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడంతో ఆర్థిక స్థితి విచ్ఛిన్నమైందన్నారు.

 

కేశవ్ బడ్జెట్‌లో రెండు రంగాలకు ప్రయార్టీ ఇచ్చారు. వాటిలో బీసీ సంక్షేమం (39,007 కోట్ల రూపాయలు) ఒకటైతే.. మరొకటి పాఠశాల విద్య(29,909 కోట్ల రూపాయలు)కు అధిక ప్రాధ్యాన్యత ఇచ్చారు. ఉపాధ్యాయులు బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అనవసరమైన యాప్‌లను తొలగించినట్టు చెప్పుకొచ్చారు. తద్వారా ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించారు.

 

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయుల నూతన శక్తిని నింపేందుకు 16,347 పోస్టులను భర్తీకి మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.

 

కళాశాలల నుంచి ధృవ పత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల నిధులను ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాలలోకి జమ చేయనుంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలల్లో మౌలిక వనరులను బలోపేతంపై దృష్టి సారించింది. ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయల కేటాయించింది. మూడో ప్రయార్టీగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *