కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ సంచలన వాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలల పూర్తయిందని.. ఇప్పుడు ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలుసొచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు.

 

అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలని అన్నారు. ప్రజలు బాధ్యత ఇస్తే.. అంతే బరువుతో సేవ చేయాలన్నారు కేసీఆర్. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా కేసీఆర్ సమక్షంలో సినీ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 

మాకు మాటలు రావనుకుంటున్నారా..? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాం అని కేసీఆర్ అన్నారు. రౌడీ పంచాయతీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యత అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు తొంటి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ చెప్పారు. ప్రజలను నేరుగా కలవడంతోపాటు పార్టీ శ్రేణుల్లో కేసీఆర్ ఉత్సాహం నింపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *