మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో, రైతుల రుణమాఫీ, 25 లక్షల ఉద్యోగాలు..

మహారాష్టలో అసెంబ్లీలో విజయం సాధించేందుకు మహాయుతి కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు కొద్ది సమయం ఉండడంతో కూటమి, ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ గురించి తొలిసారి ప్రస్తావించింది. ఇంకా మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు మీకోసం..

 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం కొద్దిరోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార బీజేపీ-మహాయుతి కూటమి తమ అస్త్రాలను బయటపెట్టింది. ఇందులోభాగంగా ఆదివారం కూటమి మేనిఫెస్టోని విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ముంబై బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రులు అమిత్ షా, పియూష్ గోయల్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూటమి సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేశారు.

 

మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవడానికి తొలిసారి రైతు రుణమాఫీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ కూటమి. అన్నదాతలకు రుణమాఫీని ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న లడ్కీ బహిన్ యోజన కిందట ఇస్తున్న మొత్తాన్ని రూ. 1500 నుంచి రూ. 2,100 పెంచుతున్నట్లు పేర్కొంది. 11 లక్షల మంది మహిళలకు ఇస్తున్న లక్షపతి దీదీ పథకాన్ని, 50 లక్షల మందికి విస్తరించనుంది. వృద్ధులకు ఇస్తున్న రూ.1500 నుంచి రూ.2,100 పెంచుతున్నట్లు వెల్లడించింది.

 

రాబోయే ఐదేళ్లలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సంకల్ప్ పత్ర పేరులో పేర్కొంది బీజేపీ కూటమి. పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో రూ. 25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణం ఇస్తామని తెలిపింది. ఎరువులపై జీఎస్టీ తిరిగి రైతులకు ఇస్తామని వెల్లడించింది.

 

ఎంఎస్పీ కంటే తక్కువ పంటలు కొనుగోలు చేసిన రైతులకు బవంతర్ యోజన ద్వారా పరిహారం అందిస్తామన్నారు. ఓవరాల్‌గా కీలకమైన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజల్లో టెక్నాలజీ బలోపేతం కోసం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నది మరో కీలకమైన పాయింట్.

 

ఈ సందర్బంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీకి అసలైన పోటీ మహా వికాస్ అఘాడీతోనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయన్నారు. రైతులను గౌరవించడం, మహిళలకు ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నదే తమ ధ్యేయమని నొక్కి వక్కానించారు.

 

ఉద్దశ్ థాక్రేని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్ గురించి సానుకూలంగా మాట్లాడేలా రాహుల్‌గాంధీని ఒప్పిస్తారా? బాలాసాహెబ్ ఠాక్రే గురించి కాంగ్రెస్ నాయకుడ్ని మెచ్చుకునే చెబుతారా అంటూ హిస్టరీని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారాయన.

 

నవంబర్ 6న మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. ఇరు పార్టీల మధ్య మేనిఫెస్టో విడుదల కావడంతో రెండు కూటముల మధ్య మాటల యుద్థం పెరిగే అవకాశముంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. మొత్తం 288 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *