కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కులగణనను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులగణను స్వాగతిస్తున్నామని పాజిటివ్ గా మాట్లాడుతూనే రాజకీయ, ఆర్థిక నేపథ్యంపై ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తైందని, బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. కొత్త హామీలు దేవుడెరుగు కానీ ఉన్నవాటిని కూడా రద్దు చేశారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసిందని, వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. చేతి గుర్తుకు ఓటేస్తే, చేతివృత్తులవారి గొంతు కోసిందని మండిపడ్డారు. ఇప్పుడు బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో నాటకం ఆడుతోందని ఆరోపించారు. సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని అన్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని పొంగులేటి అంటున్నారని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. రూ.3 లక్షల బీసీల ఫీజు రీ అంబర్స్మెంట్, బీసీ గురుకులాలు, బీసీ డిగ్రీ కళాశాలలు ఎటు పోయాయని అడిగారు.
చేసిన మోసానికి రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిపై తమకు అనుమానాలు ఉన్నాయని, 60 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టింది ఏమి లేదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పై బీసీలను చైతన్యం చేస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ లపై వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేల పై దాడి చేస్తున్నారని, దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పారు. సిగ్గు ఎగ్గు, నీతి, లేకుండా రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడాడని మండిపడ్డారు. మహారాష్ట్రకు వెళ్లి చేయని పనులు, చేసినట్లు చెప్పారని విమర్శించారు. రైతులకు 500 బోనస్ ఇచ్చినట్లు మహారాష్ట్రలో చెప్పారని, అది నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామన్నారు. 420 హామీలు, 6 గ్యరెంటీలు అమలు చేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు.