టీటీడీ స్థాయిలో యాదగిరిగుట్ట బోర్డు..!

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆలయ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుండి అన్ని రికార్డుల్లో తప్పనిసరిగా అదొక్క మార్పు చేయాలని ఆదేశించారు. అంతేకాదు త్వరలో ఆలయ బోర్డు ఏర్పాటు చేస్తామని గుడ్ న్యూస్ కూడా చెప్పారు సీఎం. దీనితో ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆలయ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావలసిన అన్ని చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే యాదగిరిగుట్టలో గల గోశాలలోని గోవుల సంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకుని వచ్చే అంశాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని, అవసరమైతే టెక్నాలజీని కూడా గోసంరక్షణకు ఉపయోగించాలని సీఎం సూచించారు.

 

అలాగే కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేనట్లు గుర్తించిన సీఎం, కొండపై నిద్ర చేసి భక్తులు ముక్కులు తీసుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను సీఎం కోరారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల గురించి అధికారులు తెలుపగా, అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని, బ్రహ్మోత్సవాలు నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

 

ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని, ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు ప్రపోజల్స్ తో తనను కలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

 

నేటి నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని, ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. అంటే నేటి నుండి యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగా ఆలయం ప్రాచుర్యంలోకి రానుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో టీటీడీ స్థాయి బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించడంతో యాదాద్రి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్లుగా భక్తులు భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *