నా మీద కేసు ఫైల్ చేస్తారా.. అరెస్ట్ చేస్తే చేయండి.. యోగా సాధన చేసి, స్లిమ్ గా బయటకు వస్తాను. అంతేకానీ భయపడేదే లేదు. హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు కృషి చేశా అంతేకానీ నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారానికి సంబంధించి వివాదం రేగుతున్న సంధర్భంగా కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో, ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైంది.
ఈ విషయానికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ఏసీబీకి విచారణ జరపాలని లేఖ రాసింది. అయితే ఈ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందుకే కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ నుండి తనకు ఎలాంటి నోటీసు రాలేదని, న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయన్నారు. ఈ అంశంలో అధికారుల తప్పిదం లేదని, తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి విషయంలో తానే అనుమతి ఇచ్చానని, ఎఫ్ఈఓ కు డబ్బులు చెల్లించింది కూడా వాస్తవమేనంటూ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను చేసిన కృషికి, కేసులు పెడతామంటే రెడీ అన్నారు. ఇందులో హెచ్ఏండిఏ నిధులు కాబట్టి కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అందుకే తాను నిర్ణయం తీసుకొని, నిధులు విడుదల చేశామన్నారు.
ఫార్ములా-ఈ కారు రేస్ తో ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాష్ట్రానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేటీఆర్ అన్నారు. ఇక ప్రభుత్వం తనపై ఎఫ్ఐఆర్ నమోదుకై గవర్నర్ కు లేఖ రాసిన విషయంపై కేటీఆర్ స్పందించారు. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తానంటూనే, రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయట పడిందన్నారు. జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని, తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే రెడీ అన్నారు. కేటీఆర్ టార్గెట్ చేయడం మరచి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని కేటీఆర్ కోరారు.
రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని, యోగా చేసుకుని బయటకు వస్తానని, తర్వాత పాదయాత్రకు సిద్దమవుతానన్నారు. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. మొత్తం మీద ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ కానున్నారా? గవర్నర్ అనుమతులు ఇస్తారా? అసలు ఏమి జరగనుందో మున్ముందు తెలియాల్సి ఉంది