ఏపీలో కూటమి సర్కార్ కు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఓ విషయంలో ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కూటమి సర్కార్ తో విధానపరంగా మాత్రమే విభేదిస్తూ అవసరమైన సమయంలో కలిసి సాగుతున్న వైఎస్ షర్మిల ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆమె రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వానికి సూచించారు.
సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా అని వైఎస్ షర్మిల తెలిపారు. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారన్నారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా ..రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారంటూ వైసీపీ సానుభూతి పరులపై విమర్శలు గుప్పించారు.
l
సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నానని షర్మిల తెలిపారు. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ ..పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలన్నారు. తన మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని, తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఇంటి పేరు మార్చి శునకానందం పొందారన్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టానన్నారు. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందన్నారు.మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే..భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్నికోరారు.