మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని, చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చేరలేకపోతున్నవారికి సాయం చేసేందుకు పథకాన్ని తీసుకువచ్చింది. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగ్గా పీఎం విద్యాలక్ష్మి పేరుతో పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన మధ్య తరగతి విద్యార్థులు చదువుకునేందుకు లోన్ పొందవచ్చు.
పథకానికి అప్లై చేసుకునేవారు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ లో నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. లోన్ తీసుకునేందుకు కొలేటరల్, గ్యారంటర్ కూడా అవసరం లేదని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం పొందవచ్చని చెప్పారు. తీసుకున్న రుణంలో75 శాతం బ్యాంకులకు కేంద్రం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. పథకం కింద ఏడాదికి గరిష్ఠంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని చెప్పారు.
వార్షిక ఆదాయం రూ.8 లక్షల వరకు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తున్నట్టు తెలిపారు. రూ.10 లక్షల వరకు 3శాతం వడ్డీం రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలను మాత్రమే మధ్యతరగతి కుటుంబాలుగా పరిగనిస్తే అంతకంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏడాదికి రూ.8 లక్షల కుటుంబ ఆదాయం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కూడా స్థిరంగా ఉన్నట్టేనని చెప్పొచ్చు. రాబట్టి ఈ పథకం అసలైన మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడదు అనే విమర్శలు వస్తున్నాయి.