ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణల కట్టడికి ఏర్పాటైన హైడ్రా ఈమధ్య కాస్త స్పీడ్ తగ్గించింది. కానీ, సైలెంట్‌గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపరేషన్‌లో ఉంది. రోజూ హైడ్రాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే క్రమంలో అధికారులు సర్వేలు చేస్తున్నారు. తాజాగా అమీన్ పూర్ భూములపై ఫోకస్ పెట్టింది హైడ్రా. పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అమీన్ పూర్‌లో మంగళవారం హైడ్రా ఆధ్వర్యంలో సర్వే జరిగింది.
జేడీ సర్వే కార్యాలయ అధికారులతో పాటు హైడ్రా అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎకరాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు, రహదారులను గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు కబ్జా చేశారంటూ వెంకటరమణ కాలనీ వాసులు ఫిర్యాదు చేవారు. ఇరు పక్షాల వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే జరిపించింది హైడ్రా. మొత్తం 5 సర్వే నెంబర్లలోని 150 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని అధికారులు సర్వే చేశారు.
వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ వాసులు, గోల్డెన్ కీ వెంచర్ నిర్వాహకులతో పాటు పరిసర కాలనీ వాసులు, గ్రామస్తుల సమక్షంలో ఇది జరిగింది. లే అవుట్లను పరిశీలించి సర్వే నెంబర్ల ఆధారంగా, పార్కు స్థలాలతో పాటు రహదారులను కాపాడే పనిలో పడింది హైడ్రా. సర్వే నంబర్లు, హద్దు రాళ్ల ఆధారంగా భూముల సరిహద్దులను నిర్ధారించి ఎవరి లే అవుట్‌లోకి ఎవరూ చొరబడ్డారనేది తేల్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సర్వేలో హైడ్రా, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.
మియాపూర్ కబ్జాలపై దృష్టి
మియాపూర్‌లోని సర్వే నెంబర్ 100, 101లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా దృష్టి సారించింది. విచారణ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. భూముల వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి, సుమారు 15 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుండి వివరాలు సేకరించిన అధికారులు, త్వరలో చర్యలకు రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణపై ప్రధాన దృష్టి సారించారు అధికారులు.