ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ఆఫర్..

తెలంగాణ వ్యాప్తంగా నేడు సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అటువంటి విమర్శలు చేసే వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏమిటంటే?

 

హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సమగ్ర సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

 

మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తమ నేత రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సర్వేను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని, సర్వే ద్వారా వచ్చిన డేటాతో భవిష్యత్ లో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుందన్నారు.

 

ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ఆఫర్..

రాష్ట్ర వ్యాప్తంగా సర్వే సాగుతున్న నేపథ్యంలో కొందరు సర్వేను రాజకీయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి పొన్నం అన్నారు. అలాగే అనవసరంగా సమస్యలు సృష్టించకుండా, ఏవైనా సమస్యలు అంటే తనను నేరుగా అడగవచ్చని, లేకుంటే తనను సంప్రదించాలని ప్రతిపక్షాలకు సూచించారు. అందరి సూచనలు, సలహాలు తీసుకొనే సర్వే ప్రశ్నలు తయారు చేసినట్లు, 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ సర్వే వివరాలు సేకరిస్తారన్నారు.

 

జిరాక్స్ పత్రాలు వద్దే.. వద్దు

సర్వే వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి జిరాక్స్ పత్రాలు అవసరం లేదని మంత్రి అన్నారు. ఆధార్ కార్డు వివరాలు కూడా ఆప్షనల్ మాత్రమేనని, ఇంటిలో ఒక్కరూ ఉన్నా తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుపవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 17లక్షల 44వేల గృహాలు ఉండగా, సర్వే కోసం 87 వేల 900 మందిని నియమించామన్నారు. మరి సర్వేపై సమస్యలు ఉన్న ప్రతిపక్ష నేతలు, నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఎటువంటి అంశాలు తీసుకువస్తారో కానీ, మంత్రి మాత్రం నన్ను సంప్రదించండి అంటూ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *