మాజీ సీఎం జగన్ కు కేటాయించిన భూములను పరిశీలించనున్న పవన్ కల్యాణ్..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ జిల్లాలో మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించనున్నారు. జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవర్‌కు 1515.93 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ భూములను సర్వే చేయాలని డీప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో అటవీ, రెవెన్యూ అధికారులు

సర్వే చేశారు.

 

సర్వే నివేదికను పవన్ కల్యాణ్ కు అందించారు. నివేదికను పరిశీలించిన ఆయన మంగళవారం ఉదయం సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తారు. ఆ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా పవన్ కల్యాణ్ సోమవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హోం మంత్రి టార్గెట్ గా ఆయన మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయం దుమారం లేపాయి. శాంతి భద్రతల విషయంలో పవన్ బహిరంగంగా హోం మంత్రి, పోలీసులకు పవన్ చురకలు అంటించారు.

 

పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధికారుల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు.క్రిమినల్‌కు కులం, మతం ఉండదన్నారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కీలకమైందని గుర్తు చేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. హోం మంత్రి అనిత కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తాను హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు.

 

డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు సరిగా లేవనే విధంగా వ్యాఖ్యలు చేయడంపై టీడీపీలో చర్చ మొదలైంది. పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామన్నారు. సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్‌ బాధాకరం. ఇలాంటి వారిపై గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పడు ఇలాంటివి జరిగేవి కావన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పకడ్బందిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *