కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం..!

కెనడాలోని హిందూ భక్తులపై ఖలిస్థానీ గ్రూప్‌ నకు చెందిన కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బ్రాంప్టన్ లో ఉన్న హిందూ సభా దేవాలయంలో భక్తులపై ఖలిస్థానీలు దాడి చేశారు. కెనడాలో హిందూ భక్తులపై, హిందూ దేవాలయంపై జరిగిన దాడి పట్ల ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. “ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయం మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కెనడాలో భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురిచేసే పిరికిపంద యత్నాలుగా భావిస్తున్నాను. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు. కెనడా ప్రభుత్వం ఈ ఘటనపై చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కెనడా, భారత్ నడుమ దౌత్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు.

 

భారతీయుల భద్రతపై కేంద్ర విదేశాంగశాఖ ఆందోళన

 

బ్రాంప్టన్‌ లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని వేర్పాటువాద గ్రూపులు దాడికి తెగబడటం పట్ల భారతీయ విదేశాంగ శాఖ సీరియస్ గా స్పందించింది. కెనడాలో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. “కెనడాలోని హిందూ దేవాలయం మీద, హిందూ భక్తుల మీద ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తరహా దాడుల నుంచి అన్ని ఆలయాలను కాపాడాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం భావిస్తున్నాం. కెనడాలో మా దేశ ప్రజల భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నాం. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని విదేశాంగశాఖ తేల్చి చెప్పింది.

 

హిందూ ఆలయంపై దాడిని ఖండించిన కెనడా ప్రధాని ట్రూడో

 

అటు బ్రాంప్టన్‌ లోని హిందూ ఆలయ కాంప్లెక్స్‌ లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేయడాన్ని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని, ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందన్నారు. ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ దాడి ఘటన నేపథ్యంలో బ్రాంప్టన్‌ ఆలయం దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో భద్రతా దళాలను మోహరించారు.

 

గత కొంతకాలంగా భారత్-కెనడా నడుమ దౌత్య వివాదం

 

గత కొద్ది నెలలుగా భారత్, కెనడా నడుమ దౌత్యవివాదం కొనసాగుతోంది. భారత్, కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులను చంపడంతో పాటు తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జార్ హత్యకు భారత హైకమిషర్ వర్మకు సంబంధం ఉందంటూ ఆయన పేరును నిందితుల లిస్టులో చేర్చారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో కలిసి కెనడా గడ్డపై భారత ఏజెంట్లు టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కెనడా నుంచి ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించారు. ప్రతిగా భారత ప్రభుత్వం కూడా కెనడా దౌత్యవేత్తలకు దేశ బహిష్కరణ విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *