రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అలాగే, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్ట్ అందించాలన్నారు సీఎం.