డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా చెప్పారో లేదో, ఇలా రంగంలోకి దిగారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. హడావుడిగా అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాలను హోం మంత్రి నిర్వహించడంపై పవన్ వ్యాఖ్యల ఎఫెక్ట్ అంటున్నారు విశ్లేషకులు.
పిఠాపురం పర్యటన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులపై సీరియస్ గా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారినా పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు లేదని, అందుకు ఉదాహరణగా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలే ఉదాహరణ అంటూ ప్రసంగించారు. అంతేకాదు తాను హోంమంత్రి గా భాద్యతలు తీసుకుంటే, కథ వేరేగా ఉంటది అంటూ పవన్ చెప్పారు. అలాగే హోం మంత్రి కూడా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, అప్పుడే శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా సాగుతుందని, ఇలాగే నేరాల పరంపర సాగితే తాను హోం మంత్రిగా భాద్యతలు తీసుకుంటానంటూ చెప్పడం సంచలనానికి దారి తీసింది.
పవన్ చేసిన కామెంట్స్ కు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం మద్దతు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయని, పవన్ వాస్తవమే చెప్పారన్నారు ప్రభాకర్ రెడ్డి. అలాగే మంత్రి నారాయణ కూడా పవన్ కామెంట్స్ పై స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు అలర్ట్ గా తీసుకోవాలని, సీఎం చంద్రబాబు అందరినీ కోఆర్డినేట్ చేస్తారన్నారు.
ఇలా తన శాఖ గురించి ఏకంగా పవన్ కామెంట్ చేయడంతో, మంత్రి అనిత అలర్ట్ అయ్యారు. ఒకేరోజు రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన హోంమంత్రి ప్రస్తుతం ఆయా జిల్లాలలో శాంతి భద్రతల స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయో ఆరా తీశారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పోలీస్ అధికారులకు హోం మంత్రి సూచించారు.
పవన్ చేసిన కామెంట్స్ పై కూడా మంత్రి స్పందిస్తూ.. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలని పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుతో తాను చర్చిస్తున్నానని, పవన్ కు కూడా అన్ని విషయాలు తెలుసన్నారు. పవన్ ఏ కేసు విషయంలో సీరియస్ గా ఉన్నారో తనకు తెలుసని, త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ తో భేటీకానున్నట్లు హోం మంత్రి తెలిపారు. ఇలా పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన క్రమంలో, మంత్రి అనిత కూడా తన వర్కింగ్ స్టైల్ మార్చి పోలీసులకు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.