సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే ఓసారి యాద్రాద్రిలో పర్యటించగా ఇది రెండోసారి. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలెక్టర్ తో కలిసి గుట్ట కింద ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. 8వ తేదీ ఉదయం యాదాద్రిలో స్వామివారిని దర్శించుకోబుతున్నట్టు సమాచారం. అనంతరం పెండింగ్ లో ఉన్న ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించబోతున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం పనులపై ఆయన సమీక్ష చేయబోతున్నారట. దీంతో ఆలయ అభివృద్ధిపైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి యాదాద్రికి వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కార్తీకమాసం కావడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎం పర్యటనకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి సీఎం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.