15 వేల కోట్ల అమరావతి రుణానికి వరల్డ్ బ్యాంక్ కీలక షరతు-అమలుకు సిద్ధమైన సర్కార్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ షరతులతో అంగీకరించింది. ప్రభుత్వం కోరిన విధంగా నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించిందని, అయితే కొన్ని సూచనలు చేసిందని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ తెలిపారు. ఇవాళ జరిగిన సీఆర్డీయే 39వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు.

 

గత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాట చేసిందని, అమరావతి తిరిగి నిర్మిస్తామని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నారాయణ తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 29 న ఇంజినీర్ల తో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గతంలో నిలిచిపోయిన పనుల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందన్నారు.

పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఎలా పిలవాలని 23అంశాలతో నివేదిక ఇచ్చారని తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదిక ను అధారిటీ ఆమోదించిందన్నారు. దీంతో కొత్తగా టెండర్లు పిలవాలని అధారిటీ నిర్ణయించిందన్నారు.

 

అధారిటీ నిర్ణయంతో CRDA కమిషనర్ ఏజెన్సీలతో మాట్లాడి టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తారని మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ నెలాఖరుకు టెండర్లు దాదాపు పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ,హైకోర్టు ఐకానిక్ భవనాలకు జనవరి నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, వరద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వరల్డ్ బ్యాంక్ సూచించిందని నారాయణ తెలిపారు.

 

సీడ్ కేపిటల్ లో 48కిలోమీటర్ల మేర కాలువలు వస్తున్నాయని, క్యాపిటల్ సిటీ వెలుపల రెండో దశలో వరద నివారణ పనులు చేపట్టాలని మంత్రి తెలిపారు. వరద నివారణ పనులకు నెదర్లాండ్స్ నివేదిక ఇచ్చిందని, రెండో దశ వరద నివారణ పనులకు సమగ్ర నివేదిక తయారీకి అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి చుట్టూ బైపాస్ రోడ్లు వచ్చినా ఔటర్,ఇన్నర్ రింగ్ రోడ్లు ఉంటాయని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *