ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు వైద్యం అందించినా మందులు మాత్రం బయట ఫార్మసీలోనే కొనుక్కోవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రుల్లో కొన్ని మందులు ఇచ్చినా పూర్తిగా మాత్రం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు అత్యవసర, అదనపు జాబితా కింద 568 మందులతో లిస్ట్ సిద్దం చేసింది. వీటిని జిల్లాకు ఒక డ్రగ్స్ స్టోర్ ఏర్పాటు చేసి సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని నుండి డ్రగ్స్ కొరత లేకుండా వైద్య కళాశాలలకు, జిల్లా ఆస్పత్రులకు, ప్రాంతీయ వైద్యశాలలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను తరలించనున్నారు. గతంలో పది ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ల నుండి మందులు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందుల కొరత నెలకొనడంతో ప్రతి జిల్లాకు ఒక డ్రగ్స్ స్టోర్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది.
అదేవిధంగా దవఖానాల్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా ప్రతిరోజు అవసరమైన ఔషదాల జాబితాను డ్రగ్స్ స్టోర్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని డ్రగ్స్ స్టోర్ లో ఏవైనా మందులు లేనట్టయితే వెంటనే సమీపంలో ఉన్న జిల్లా నుండి ఆ మందులు తెచ్చుకోవాలని, కానీ రోగులను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పంపకూడదని ఆదేశించింది. మరోవైపు ఫార్మసిస్టులు, సీడీఎస్ నిర్వాహకులు అవకతవకలకు పాల్పడకుండా టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమచింది. ఈ బృందం తరచూ ఆస్పత్రులకు వెళ్లి అక్కడ మందుల కొరత ఉందా లేదా అనేదానిపై పర్యవేక్షించాల్సి ఉంటుంది.