జనం కోసమే పుట్టిన జనసేన.. ఇప్పుడు.. సనాతన సేనగా మారుతోందా? సనాతన ధర్మ పరిరక్షణకు సిద్ధమైన పవన్ కల్యాణ్.. పార్టీ సిద్ధాంతాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారా? తిరుమల లడ్డూ వివాదం తర్వాత.. పవన్ కల్యాణ్ భాష మారింది. వేషం మారింది. ఆయన సిద్ధాంతమే మారిపోయింది. ఇప్పుడు ఏకంగా.. జనసేనలో సనాతన ధర్మ విభాగాన్నే మొదలుపెట్టేశారు. అసలు.. పవన్ విజన్ ఏంటి? జనసేన జెండా కిందకి.. సనాతన ధర్మం ఎజెండా కూడా చేరనుందా?
ఇదీ విషయం.. జనసేనలో సనాతన ధర్మ విభాగం కూడా మొదలైపోయింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నారసింహ వారాహి గణం పేరుతో.. ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. ఇకపై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో.. సనాతన ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కోసం.. ఈ విభాగం పనిచేయబోతోంది. సనాతన ధర్మం ఉంటేనే.. ఈ దేశం గట్టిగా నిలబడుతుందని బలంగా నమ్ముతున్నారు పవన్ కల్యాణ్. సనాతన ధర్మంపై కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఎవరైనా వ్యవహరించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. ఏమాత్రం సహించేది లేదని.. హెచ్చరించారు.
సనాతన ధర్మాన్ని పవన్ కల్యాణ్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే.. చివరికి తన అభిమానులకు కూడా ఆయన చేసిన సూచన చూస్తే తెలిసిపోతుంది. తన ఫ్యాన్స్ సినిమా పేర్లు జపించడం కన్నా.. భగవన్నామస్మరణ చేస్తే మంచిదని అన్నారు. ముఖ్యంగా.. సనాతన ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు పవన్. ఇక.. ఏపీ వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలోనే.. దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడేందుకు ఓ కార్యాచరణ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు పవన్ కల్యాణ్. సుమారు 60 వేల ఎకరాల మేర ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని.. వాటిని తిరిగి దేవాలయాలకు అప్పగించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆలయాలకు, ధర్మ సత్రాలకు ఉన్న ఆస్తుల్ని రక్షించే బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించాలని.. అధికారులకు కూడా స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ మధ్యకాలంలో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా.. ఎక్కడో ఓ చోట సనాతన ధర్మం ప్రస్తావన వస్తోంది. మన మూలాల్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అనే మాటలు వినిపిస్తున్నాయ్. ఇదంతా.. చూస్తుంటే.. జనసేన లైన్ మారినట్లే కనిపిస్తోంది. తమ ఎజెండాలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు.. సనాతన ధర్మాన్ని కూడా పవన్ కల్యాణ్ చేర్చారనే విషయం క్లియర్‌గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో తమ స్టాండ్ ఏమిటన్న దానిపై పవన్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు.. ఆయన చెబుతున్న మాటలు, పార్టీ పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. సనాతన ధర్మం విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నారనే అంశానికి బలం చేకూరుస్తున్నాయ్.