కూటమి ప్రభుత్వ నేతలు ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ విమర్శలు గుప్పించారు. ఉచిత సిలిండర్లు పేరుతో హడావిడి చేస్తున్నారని, మరి విద్యుత్ ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వ తీరును ఏంటని ప్రశ్నించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో పేదల నుంచి భారీగా దండుకుంటున్నారని అన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే అంటూ వ్యాఖ్యానించారు.
ఉచితాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన వైఎస్ షర్మిళ.. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి రూ. 2,685 కోట్లు ఇవ్వనుండగా.. అదనపు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి రూ. 6 వేల కోట్లను ముక్కుపిండి వసూలు చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అధిక కరెంట్ ఛార్జీల బారిన పడుతున్నారని అన్నారు. తామేదో కష్టపడుతున్నట్లు నేతలు మాట్లాడుతున్నా.. వాస్తవంలో ప్రజలపైనే రూ. 3వేల కోట్ల అదనపు భారం పడుతుంది కదా.? అని ప్రశ్నించారు.
దీపం పథకం ద్వారా ప్రతీ ఇంట్లో వెలుగులు నింపుతున్నామంటున్న చంద్రబాబు సర్కారు.. వాస్తవానికి కరెంటు బిల్లుల రూపంలో నిరుపేదల ఇళ్లల్లో కారు చీకట్లు నింపుతోందని విమర్శించారు. తమకేమీ సంబంధం లేదని.. ఇవ్వనీ గత పాలనలో జరిగిన తప్పిదాలని తప్పించుకుంటే సరిపోదని వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిళ.. బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని చెప్పడం సరైంది కాదని అన్నారు. ఇవ్వనీ కుంటి సాకులు తప్పా మరొకటి కాదని షర్మిళ వ్యాఖ్యానించారు.
మీకు, జగన్ కు తేడా ఏముంది చంద్రబాబు.?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు చార్జీలు పెంచగా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమంటూ ఎన్నికల హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పైగా.. అవసరమైతే 35 % ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామి ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి నేతలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ అదే పని చేస్తున్నారని అన్న వైఎస్ షర్మిళ.. మీకూ, వాళ్లకు తేడా ఏంటి.?, 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా అదే దారిలో నడుస్తున్నారు కదా .? అని ప్రశ్నించారు.
బీజేపీకి మద్దతు ఇచ్చారుగా.. సాయం అడగండి.
కేంద్రంలో అధికార బీజేపీతో జట్టు కట్టి అధికారంలో ఉన్నా కూడా ఇలా వ్యవహరించడం తగదన్న వైఎస్ షర్మిళ.. ప్రజలపై ఇలా అనవసర భారాలు మోపడం సమంజసం కాదని అన్నారు. మీకు కేంద్రంలో అనుకూల ప్రభుత్వమే ఉన్నప్పుడు.. వారి సాయం తీసుకోవచ్చుగా అని సూచించిన షర్మిళ.. కరెంట్ బిల్లల అదనపు భారం ప్రభుత్వాలే మోయాలి కానీ, ప్రజలపై మోపవద్దని డిమాండ్ చేశారు. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంతో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.