టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో గుంతలు పూడ్చడానికి రూ.860 కోట్లు ఖర్చుపెడుతున్నామని అన్నారు. గాడితప్పిన వ్యవస్థల్ని దారిలోపెట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లాలా చేయాలని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో అన్ని రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికను రూపొందిస్తామని, రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు కావాలని చెప్పారు. గుంతలు లేని రోడ్లే టీడీపీ ప్రభుత్వం లక్ష్యం అని, ఐదేళ్లు గుంతలు తవ్వారు, గోతులు పెట్టారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
రోడ్లను ప్రమాదకరంగా మార్చేశారని మండిపడ్డారు. రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నాలు అని రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని తెలిపారు. అవి బాగుంటేనే సరైన సమయానికి గమ్యం చేరుకోవచ్చని అన్నారు. గత ఐదేళ్లలో రోడ్ల మరమ్మత్తుల కోసం రూ. వెయ్యి కోట్లు కాజేశారని విమర్శించారు. రోడ్లపై గర్బిణిలు డెలివరీ అయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మండిపడ్డారు. రహదారులను నరకానికి మార్గలుగా మార్చేశారని, సంక్రాంతిలోపు ఒక్క గుంత కూడా ఉండొద్దని అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలు మనకు వద్దని, అభివృద్ధి రాజకీయాలే కావాలని అన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు జగన్ స్థలం ఇవ్వలేదని, ఆయనకు దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదని విమర్శించారు. చంద్రబాబు కేంద్రానికి సహకరించకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశాడన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే జోన్ కు స్థలం కేటాయించామని, నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటికొక ఐటీ ఉద్యోగి రావాలని గతంలో పిలుపునిచ్చామని, గ్రామాలలో చిన్న సూక్ష్మతరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో దీపం పథకం తీసుకొస్తామంటే అవహేళన చేశారని, నేడు ఆ పథకంలో 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు.